
గోవులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాప్తాడు: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి అక్రమంగా ఆవులను శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష తెలిపారు. ఆదివారం ఉదయం రాప్తాడు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 407 వాహనంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్నట్లుగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, భజరంగ్ దళ్ సభ్యుడు లోకేపల్లి విశ్వనాథరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు రాప్తాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన 407 వాహనంలో ఏడు ఆవులను గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆవులను తరలిస్తున్న షేక్ బాబ్జాన్, దేశ్‌ముఖ్ బాబ్జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఆధీనంలోని గోవులను కూడేరులోని గోశాలకు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ మహిళ మృతి
కళ్యాణదుర్గం: మండలంలోని యర్రంపల్లికి చెందిన టమాట వ్యాపారి మనోహర్ భార్య గంగమ్మ (40) బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. గంగమ్మ వారం రోజుల క్రితం ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సనిమిత్తం అనంతపురం, అక్కడి నుంచి బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గంగమ్మ మృతదేహాన్ని చూడగానే బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘మాకు మా అమ్మ కావాలంటూ ఇద్దరు చిన్నారులు రోదించడం అక్కడి వారిని కలిచివేసింది. గంగమ్మకు భర్త మనోహర్, ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగమ్మ స్వగ్రామం శెట్టూరు మండలం కనుకూరు కాగా, యర్రంపల్లికి చెందిన మనోహర్‌తో వివాహం జరిగింది.
విశ్రాంత ఉపాధ్యాయుడి
ఇంట్లో చోరీ
గోరంట్ల: స్థానిక బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు గాండ్ల వెంకటచలపతి ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు.. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెంకట చలపతి వెళ్లారు. పసిగట్టిన దొంగలు శనివారం రాత్రి తాళాలను బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆదివారం ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంకటచలపతి కుటుంబసభ్యులు గోరంట్లకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని రూ.10 లక్షల నగదు, 16 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.