పచ్చ రౌడీల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

పచ్చ రౌడీల బీభత్సం

Aug 10 2025 5:48 AM | Updated on Aug 10 2025 5:48 AM

పచ్చ

పచ్చ రౌడీల బీభత్సం

అనంతపురం క్రైం/అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్‌చల్‌ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

సాయినగర్‌ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్‌ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్‌ రిజిస్ట్రార్‌ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.

దుకాణం వద్ద అరాచకం..

సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్‌ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్‌ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.

దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..

బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అనంతపురంలో మైనార్టీ కుటుంబానికి చెందిన ఆప్టికల్‌ దుకాణంపై దాడి

దుకాణంలో పని చేస్తున్న వ్యక్తులను చితకబాదిన వైనం

రేయ్‌ కొడకా.. అంతు చూస్తామంటూ షాపు యజమానికి బెదిరింపులు

గంటకు పైగా ‘పచ్చ’ గూండాలు

రెచ్చిపోయినా కన్నెత్తి చూడని పోలీసులు

పచ్చ రౌడీల బీభత్సం 1
1/1

పచ్చ రౌడీల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement