
రమణా నాయక్ ఎస్కేప్!
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణ చట్టం అతిక్రమణ, ఐదు నెలల గర్భిణీ మృతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సర్వజనాస్పత్రి సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణా నాయక్ విచారణకు హాజరు కాకుండా ఎస్కేప్ అయ్యారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామానికి చెందిన గర్భిణీ రాధమ్మ (29) నగరంలోని శ్రీ కృప ఆస్పత్రిలో ఆపరేషన్ చేసే సమయంలో మృతి చెందింది. డాక్టర్ రమణా నాయక్ నిర్లక్ష్యంతోనే మరణం సంభవించినట్లు తేలడంతో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి ఆస్పత్రిని సీజ్ చేశారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు.జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం, అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్, గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు డాక్టర్ మనోహర్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. ఈ క్రమంలోనే శనివారం సర్వజనాస్పత్రిలోని మెయిన్ ఆపరేషన్ థియేటర్‌లో కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. గర్భిణీ రాధమ్మకు మత్తు మందు ఇచ్చిన వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీ శిల్ప, ఏఎన్‌ఎం మారెక్కను విచారించారు. అయితే, డాక్టర్ రమణా నాయక్ విచారణకు హాజరు కాలేదు. ఈ విషయమై అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించారు. విచారణ అనంతరం ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
కమిటీ విచారణకు గైర్హాజరు