
వైఎస్సార్ సీపీ వారిని వేధించడమే జేసీ పని
తాడిపత్రి టౌన్: మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికార అండతో వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే పట్టణంలో నిర్మాణంలో ఉన్న తన ఇంటిని ధ్వంసం చేయించిన జేసీ.. నేడు తన పొలాన్ని టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడన్నారు. ట్రాన్స్‌కో అధికారులను బెదిరించి నందలపాడు పొలం సర్వే నంబర్ 166ఏ, బీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారన్నారు. ఈ నెల 6న పొలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో తాను వెళ్లి అడ్డుకున్నానన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా పొలంలో విద్యుత్ స్తంభాలెలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తే పనులు ఆపేస్తాం అని ట్రాన్స్‌కో అధికారులు చెప్పారన్నారు. కానీ, రాత్రికి రాత్రి మళ్లీ తన పొలంలోకి చొరబడి స్తంభాలు నాటారన్నారు. 25 మీటర్ల మేర పొలంలోకి వచ్చి స్తంభాలు ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ రాజారాం, సీఐ శివగంగాధర్‌రెడ్డికి వేర్వేరుగా ఆయన వినతి పత్రాలు అందజేశారు. విద్యుత్ అధికారులు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.