రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం దేవేరులతో కలసి సింహవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ధ్వజారోహణ, యాగశాల ప్రవేశ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.
ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలి
● మాజీ మేయర్ రాగే పరుశురాం
అనంతపురం టవర్‌క్లాక్: ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మేయర్ రాగే పరుశురాం అన్నారు. పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక కనకదాస కల్యాణ మంటపంలో ప్రతిభ పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాగే పరుశురాంలో పాటు అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కురుబలు తమ పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు మర్రిస్వామి, నాయకులు సంజీవరాయుడు, రాజహంస శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్, వీరనారప్ప, సతీష్, చిట్రా పరుశురాం, నారాయణ స్వామి, ఓబులేసు పాల్గొన్నారు.
ప్రభుత్వ భవనం కూల్చివేతపై కేసు నమోదు
బొమ్మనహాళ్: మండలంలోని గోవిందవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువైద్యశాల భవనాన్ని కూల్చివేశారని మండల పశువైద్యాధికారి వెంకటరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. 2001లో నిర్మించిన భవనం శిథిలావస్ధకు చేరిందని, దీంతో మరో భవనంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని తన ఫిర్యాదులో వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భవనాన్ని గ్రామానికి చెందిన శరణబసప్ప, చిదానంద కూల్చి స్ధలాన్ని ఆక్రమించినట్లుగా వివరించారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సింహ వాహనంపై శ్రీవారు


