సమస్యలు పరిష్కరించండి
అనంతపురం సిటీ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శుల సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేసి, మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఇతర విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం తమ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు వెల్ణేర్ సెక్రటరీలకు కూడా పదోన్నతి కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై మంత్రి పయ్యావుల సానుకూలంగా స్పందిస్తూ.. ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరావు, జిల్లా కోశాధికారి మహేశ్ ఉన్నారు.
మంత్రి పయ్యావులకు సచివాలయ ఉద్యోగుల వినతి


