అందని సలహాలు సూచనలు
అనంతపురం అగ్రికల్చర్: ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అనే చందంగా మారింది జిల్లా ఉద్యానశాఖ పరిస్థితి. పదేళ్ల కిందటే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరు పొంది... ప్రస్తుతం ఉద్యానహబ్‌గా పిలవబడుతున్న ‘అనంత’లో ఆ శాఖకు జిల్లా స్థాయి అధికారి లేక ఏడాదవుతోంది. డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) స్థాయి అధికారి డిప్యుటేషన్‌లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారి నెల రోజుల పాటు సెలవులో వెళ్లారు. కనీసం ఇన్‌చార్జి అధికారిని కూడా నియమించలేదు. దీంతో పాలన గాడితప్పి హెచ్‌ఓ స్థాయి అధికారులే అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. పథకాల అమలు, పంటల సస్యరక్షణ సలహాలు అందక ఉద్యాన రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వంలో కాసింత కూడా చలనం లేకుండా పోయింది.
విస్తీర్ణంలో నంబర్ వన్
జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉద్యాన తోటల విస్తీర్ణంలో ‘అనంత’ మొదటి స్థానంలో ఉంది. యాపిల్ లాంటి నాలుగైదు రకాలు మినహా మిగిలిన అన్ని రకాల ఉద్యాన తోటలకు నిలయంగా మారింది. జిల్లా నుంచి చీనీ, అరటి, దానిమ్మ, టమాట, గులాబీ తదితర ఉత్పత్తులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో పేరున్న అజాద్‌పూర్ మండీలో ‘అనంత’ ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేలాది మంది ఉద్యాన రైతుల శ్రమ ఫలితంగా లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు, రూ.వేల కోట్ల టర్నోవర్‌తో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల హార్టికల్చర్ కాంక్లేవ్ పేరుతో జాతీయ స్థాయి సదస్సు సైతం అనంతపురంలోనే నిర్వహించారు. అరటి, చీనీ, మిరప, మామిడి, టమాట పంటలను ఐదు గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి కొన్ని కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసి వాటి ఫలాలు రైతులకు అందించే సరైన అధికారులు లేరు. అతి తక్కువ ఉద్యానతోటల విస్తీర్ణం కలిగిన కొన్ని జిల్లాల్లో డీడీ స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం... ఉద్యానహబ్‌గా పేరున్న ‘అనంత’ను నిర్లక్ష్యం చేయడం గమనార్హం.
72 రకాల ఉద్యాన తోటలు
జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోనూ పండ్ల తోటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. వేలాది మంది రైతులు వ్యవసాయ పంటలను తగ్గించి అంతో ఇంతో నీటి వనరుల కింద పండ్లు, పూలు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు ఉండగా... అందులో 1.80 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, 40 వేల ఎకరాల్లో సుగంధం, ఔషధ పంటలు, పూలతోటలు సాగులో ఉన్నాయి. ఒకట్రెండు కాదు... ఏకంగా 72 రకాల ఉద్యాన తోటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తోంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి.
జిల్లా స్థాయి అధికారి లేక గాడితప్పిన పాలన
జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా ఉద్యానతోటలు
72 రకాల ఉద్యాన పంటల సాగు
పంట సస్యరక్షణ సలహాలు
అందక రైతుల అవస్థలు
తరచూ వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పు కారణంగా చీడపీడలు, తెగుళ్ల బెడద కూడా అధికంగా ఉంటోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు కూడా ఏటా దెబ్బతీస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ సమస్య సైతం రైతులను వేధిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న ‘అనంత’లో ఖచ్ఛితంగా జిల్లా స్థాయి (డీడీ) అధికారి ఉండాల్సిన చోట... ఏడీ స్థాయి అధికారితో నెట్టుకొస్తున్నారు. ఆయన కూడా ఇటీవల సెలవు పెట్టారు. ఇన్‌చార్జి అఽధికారినీ నియమించలేదు. గతంలో ఇక్కడకు రెగ్యులర్ డీడీని నియమించినా... బాధ్యత తీసుకున్న రోజే డిప్యుటేషన్ కింద కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. దీంతో ఏడీ బీఎంవీ నరిసింహారావుకే ఇన్‌చార్జి డీడీ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనకు టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగ్, కమిషనరేట్ రివ్యూలు, కలెక్టరేట్ సమీక్షలకు హాజరయ్యేందుకే సమయం చాలడం లేదంటున్నారు. ఇపుడు ఆయన కూడా సెలవు పెట్టడంతో ఉద్యానశాఖకు దిక్కులేకుండా పోయింది. సస్యరక్షణ సిఫారసులు, సాంకేతిక సలహాలు, పథకాల సమచారం ఇచ్చేవారు లేకపోవడంతో రైతులకు పెద్ద సమస్యగా మారింది.


