అడవులను సంరక్షించుకోవాలి
అనంతపురం అర్బన్: అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అడవికి నిప్పు– మానవాళికి ముప్పు’ పోస్టర్లను ఇన్‌చార్జి కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసినవారమవుతామన్నారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల అటవీ సంపదకు పెనుప్రమాదం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణలో భాగస్వాములవ్వాలన్నారు. ప్రజలను ఈ దిశగా చైతన్యపర్చాలని అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి టి.చక్రపాణి, అనంతపురం సామాజిక వన విభాగం డీఎఫ్‌ఓ గురుప్రభాకర్, ఫారెస్ట్ రేంజ్, డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
15 నుంచి చౌడేశ్వరీదేవి పంచమ జ్యోతుల ఉత్సవాలు
ఉరవకొండ: ప్రతి ఐదేళ్లకోసారి ఉరవకొండలో నిర్వహించే చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల ఉత్సవాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. కోటలోని దేవాంగుల చౌడేశ్వరీదేవి ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 15న లక్ష్మీనృసింహస్వామి కాలనీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి జ్యోతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, అనంతరం కొండప్ప బావి వద్ద ఉన్న రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి మంగళవాయిద్యాలతో ఉపవాస నిర్వహణ చేస్తారు. అదే రోజు అర్ధరాత్రి 12.20 గంటలకు చౌడేశ్వరీ ఆలయం నుంచి జ్యోతులను పట్టణ పురవీధుల్లో ఊరేగించి రామలింగ చౌడేశ్వరి ఆలయానికి చేరుస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలిరానున్నట్లు జ్యోతుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రెడ్డి నాగరాజు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.
అడవులను సంరక్షించుకోవాలి


