అతిక్రమిస్తే చర్యలు తప్పవ్ : డీటీసీ
● అధిక చార్జీలు వసూలు చేసిన రెండు బస్సులపై కేసు
● పర్మిట్, ట్యాక్స్ లేని 14 బస్సులపై కూడా కేసుల నమోదు
అనంతపురం సెంట్రల్: సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సుల్లో టికెట్ చార్జీలు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు మంగళవారం హెచ్చరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేర్ మానిటరింగ్ టీమ్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వివరించారు. ఆర్టీసీ నిర్దేశించిన చార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్‌లో అదనంగా వసూలుకు అవకాశముందన్నారు. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో అధిక చార్జీలు వసూలు చేసిన రెండు బస్సులపై కేసు నమోదు చేసి, రూ. 20వేలు జరిమానా విధించామన్నారు. ట్యాక్సు చెల్లించని, పర్మిట్ లేని 14 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.96 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు. ఈ తనిఖీలు ఈనెల 18 వరకూ కొనసాగుతాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 9281607001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.


