‘ఉపాధి’ కింద 2 వేల మినీ గోకులాలు
అనంతపురం అగ్రికల్చర్: ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రెండు వేల మినీ గోకులాలను అర్హులైన పాడి రైతులకు మంజూరు చేయడానికి కలెక్టర్ ఆమోదముద్ర వేశారని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. మంగళవారం స్థానిక పశు సంవర్ధక శాఖ డీడీ కార్యాలయ సమావేశ మందిరంలో డీడీ డాక్టర్ రమేష్‌రెడ్డి, ఏడీడీఎల్ ఏడీ డాక్టర్ జి.రవిబాబుతో కలిసి అనంతపురం డివిజన్ పరిధిలో ఉన్న 16 మండలాల ఏడీలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల(వీఏఎస్)తో సమీక్ష నిర్వహించారు. గతేడాది 900 గోకులాలు మంజూరు చేయగా.. డిమాండ్ అధికంగా ఉన్నందున ఈసారి 2 వేలకు అనుమతులు వచ్చాయన్నారు. అర్హులైన రైతులను గుర్తించి పారదర్శకంగా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ నెల 16 నుంచి 31 వరకు పశువైద్య శిబిరాలు నిర్వహించి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతరత్రా ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న పశువులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు (డీవార్మింగ్) తాపించే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. అలాగే గొర్రెల్లో మసూచి నివారణకు, కోళ్లకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు.


