కలిపేసుకుందాం.. కాదనేదెవరు?
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నేతకు ప్రభుత్వ భూమిపై కన్నుపడింది. తన భూమికి ఆనుకుని ఉండటం, అక్కడ సెంటు స్థలం రూ.10లక్షల దాకా పలుకుతుండటంతో ఏకంగా 60 సెంట్లు ఆక్రమించేశాడు. రాయదుర్గం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండ చూసుకుని ఏకంగా ఆక్రమిత స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చకచకా చేసేస్తున్నాడు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్‌లో ఈ భూ కబ్జా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉద్దేహాళ్‌లో బళ్లారి – కళ్యాణదుర్గం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన 227 సర్వే నంబర్‌లో ఉన్న 5.36 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో ఓ కరణం.. ఓ మహిళకు ధారాదత్తం చేశాడు. అయితే ఆమె ఆ భూమి వైపు ఎన్నడూ రాలేదు. ఆమె మరణానంతరం కోడలు వచ్చి అందులో సగం భూమిని తన పేరు మీద చేయించుకుంది. మిగిలిన సగం భూమి ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల ఆధీనంలో ఉంది. ఈ గ్రామంలోని సినిమా థియేటర్ యజమాని అయిన కణేకల్లు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ఫక్రుద్దీన్ కూడా ఆ ముగ్గురిలో ఒకరు. చుట్టుపక్కల ఊళ్లకు ఉద్దేహాళ్ సెంటర్ కావడంతో ఇక్కడ భూములు/ స్థలాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. పై అసైన్డ్ భూమి (ప్రభుత్వ భూమి) రోడ్డు పక్కనే 600 మీటర్ల మేర పొడవుగా ఉండటం, అదీ తన భూమి పక్కనే కావడంతో అక్కడ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని భావించాడు. అంతే అందులో 60 సెంట్ల భూమి ఆక్రమణకు యత్నించాడు. అయితే అప్పట్లో స్థానిక గ్రామ సర్పంచ్ మారుతీప్రసాద్ అడ్డుకున్నాడు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఫక్రుద్దీన్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పొరుగు మండలం నుంచి వచ్చి ఆక్రమించుకోవడంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నెర్రజేశారు. ఈ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి దగ్గరకు తీసుకెళ్లారు. ‘అది ఏమైనా మీ భూమా.. ప్రభుత్వ భూమే కదా.. వాళ్ల భూమి ముందు ఉంది. ఆక్రమించుకుంటే మీకేంటి నష్టం?’ అంటూ చివాట్లు పెట్టడంతో స్థానిక నేతలు మిన్నకుండిపోయారు. ముఖ్య ప్రజాప్రతినిధి అభయహస్తంతో ఫక్రుద్దీన్ ఇటీవల సదరు 60 సెంట్ల భూమిని ఆక్రమించి.. అందులో రేకుల షెడ్లతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోరాదని రెవెన్యూ అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలు అందడంతో మిన్నకుండిపోయారని ఉద్దేహాళ్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.6కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించిన టీడీపీ నేత నుంచి రెవెన్యూ అధికారులకు కూడా రూ.10 లక్షల దాకా ముడుపులు అందాయని, అందుకే ఇటువైపు తొంగి చూడటం లేదని ఆరోపిస్తున్నారు.
బరి తెగించిన టీడీపీ నేత
ఉద్దేహాళ్‌లో 60 సెంట్ల ఆక్రమణ
చకచకా కమర్షియల్ కాంప్లెక్స్ పనులు
కలిపేసుకుందాం.. కాదనేదెవరు?


