కర్షక వనం.. కాశీపురం
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం కాశీపురమంటే గ్రామం ఒకప్పుడు పోలీసులకు సైతం కునుకు పట్టేది కాదు. ఆ గ్రామం మీదుగా జుంజురాంపల్లి, మలకాపురం, కెంచానపల్లికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. చీకటి పడగానే గ్రామం దాటి వెళ్లిన దాఖలాలు లేవు. 250 కుటుంబాలు నివాసముంటున్న ఆ గ్రామంలో ప్రస్తుతం 1,250 మంది నివాసముంటున్నారు. కావలి, హరిజనులు మాత్రమే జీవిస్తున్నారు. 750 ఎకరాల పట్టా భూములు, 112 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
దుర్భర పరిస్థితులు తాళలేక
కాశీపురం గ్రామానికి ఎలాంటి సాగునీటి వనరులు లేవు. గ్రామానికి సంబంధించి చెరువు, కుంట లాంటివి కూడా లేదు. ఉన్న 750 ఎకరాల పట్టా భూములతో పాటు 112 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల్లో వ్యవసాయాధిరత పంటలను అక్కడి వారు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1995లో కరువు విలయతాండవానికి కాశీపురం వాసులు గజగజ వణికిపోయారు. చినుకు నేల రాలకపోవడంతో పంటలు సాగు చేయలేకపోయారు. ఇళ్లలో నిల్వ ఉన్న తిండి గింజలు చూస్తుండగానే అయిపోయాయి. కరువు కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోనూ పనులు లేక ఇబ్బంది పడసాగారు. ఆకలితో ఏడుస్తున్న పిల్లల బాధను చూడలేక చివరకు రైతులు కాస్త సమీపంలోని పట్టణ ప్రాంతాలకు చేరుకుని భిక్షమెత్తుకునేందుకు సిద్ధమయ్యారు. అక్కడ వారికి ఛీత్కారాలు తప్పలేదు. ‘చూసేందుకు కాళ్లూచేతులు బాగానే ఉన్నాయి కదా? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా?’ అంటూ హేళనగా మాట్లాడుతుంటే మౌనంగా కన్నీరు పెట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. కష్ట కాలంలో ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతు బాగోగులు పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో దిక్కుతోచలేదు. పిల్లల ఆకలి తీర్చేందుకు మరో మార్గం కనిపించని పరిస్థితుల్లో ఓ రోజు రాత్రి తమ గ్రామం మీదుగా పొరుగూరికి వెళుతున్న వ్యక్తిని అటకాయించి అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం దోచేశారు. ఆ డబ్బుతో ఓ పూట పిల్లల ఆకలి తీరింది. దీంతో తాము బతకాలంటే దొంగతనాలు తప్ప మరో మార్గం లేదని భావించిన కొందరు దారిదోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు.
దొంగతనాలకు స్వస్తి పలికి
కాలానుగుణంగా అక్కడి ప్రజల్లోనూ మార్పు వచ్చింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతు కష్టాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే కాశీపురం వాసుల్లోనూ మార్పు వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కజొన్న, మిరప, వేరుశనగ, టమాట, మామిడి, కంది, అరటి, సపోట తదితర పంటల సాగు చేపట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతూ వచ్చారు. తమలా భవిష్యత్తులో పిల్లలు ఇబ్బంది పడకూడదని భావించిన గ్రామస్తులు తమ పిల్లలను చదువులపై దృష్టి సారించేలా చేశారు. 120 మందికి పైగా ఉన్నత చదువులు అభ్యసించారు. ప్రభుత్వ కొలువుల్లో ముగ్గురు స్థిరపడ్డారు. పాడి పోషణతో గణనీయ ఆర్థిక పురోభివృద్ధి సాధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జలయజ్ఞం పథకం ద్వారా మెట్ట భూముల్లో బోరుబావులు ఏర్పాటు చేసుకుని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయగలిగారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ రైతుభరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మవడి, వైఎస్సార్ ఆసరా, పక్కా గృహాలు, జగనన్న చేదోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలతో కష్టాల నుంచి గట్టేక్కి దొంగతనాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ప్రస్తుతం రైతుగా సమాజంలో గౌరవ స్థానాన్ని అంది పుచ్చుకున్నారు.
రత్నాకరుడనే దొంగ పశ్చాత్తాపంతో వాల్మీకిగా మారి రామాయణం రాసి మహర్షిగా లోకానికే ఆదర్శంగా నిలిచాడు. అచ్చం అలాగే బాటసారులను నిలువుదోపిడీ చేసే కాశీపురం వాసులు కర్షకులుగా మారి రైతులకే ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు ఆ గ్రామం మీదుగా వెళ్లాలంటే హడలెత్తిపోయేవారు... నేడు పంటల సాగు గురించి తెలుసుకునేందుకు కాశీపురం వెళ్తున్నారు. నాడు కాశీపురం వెళ్లి నిలువు దోపిడీకి గురయ్యామని చెప్పేవారు...నేడు సాగులో పాఠాలు నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. నాడు దొంగలుగా సమాజానికి దూరంగా బతికిన కాశీపురం వాసులు ఇప్పుడు హలం పట్టి వివిధ రకాల పంటల సాగుతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
కరువుతో ఒకప్పుడు చోరీలకు నిలయం
పాడిపంటలతో నేడు అభివృద్ధికి పర్యాయపదం
సమాజానికి ఆదర్శంగా నిలిచిన గ్రామం
కర్షక వనం.. కాశీపురం


