వ్యాపారం ముసుగులో భారీ మోసం
తాను చేస్తున్న వ్యాపారంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజూ రూ.2 వేలు చొప్పున ఆదాయం ఉంటుందంటూ విసిరిన పాచిక పారింది. నమ్మి రూ.లక్షల్లో జనం పెట్టుబడి పెట్టసాగారు. ఈ మోసాన్ని స్థానిక పోలీసులు పసిగట్టలేకపోయారు. చివరకు ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం చేయడంతో రంగంలో దిగే లోపు జనం భారీగా మోసపోయారు.
బొమ్మనహాళ్: జనం అత్యాశను తెలివిగా సొమ్ము చేసుకున్నాడు ఓ మోసగాడు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు నెలల క్రితం గ్రామానికి చేరుకున్న ఓ ఆగంతకుడు తన పేరు మహేష్‌రెడ్డి అని, సొంతూరు గుంతకల్లు పట్టణమని, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తుంటానని, ఉద్దేహాళ్‌లో తెలిసిన వారు ఉండడంతో ఇక్కడ బ్రాంచ్ తెరుస్తున్నట్లుగా పరిచయం పెంచుకున్నాడు. గ్రామంలోని రాధిక కాంప్లెక్స్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యాపారం పేరుతో జనాన్ని పోగేశాడు. ఈ క్రమంలో తాను చేస్తున్న వ్యాపారంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజూ రూ.2 వేలు ఆదాయం సమకూరుతుందని నమ్మించాడు. ఈ క్రమంలో కొందరు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టారు. దీంతో వారికి రోజూ రూ.2 వేలు చొప్పున ఇస్తూ మరికొందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. నమ్మిన చాలా మంది అప్పులు చేసి మరీ డబ్బు పెట్టుబడిగా ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన రంగారెడ్డి, మల్లేష్, వీరేష్, ఫృథ్వీతో పాటు మరికొందరితో ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేకుండా భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. ఈ లెక్కన గ్రామస్తులతో రూ.1.50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వన్నూరుస్వామితో సన్నితంగా ఉంటూ అతని ద్వారా గ్రామానికి చెందిన జోగి సిద్దన్న, మురిడప్ప, లింగన్నకు చెందిన 50 గొర్రెలు, నేమకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజు వద్ద నుంచి 40 గొర్రెలను కొనుగోలు చేయించాడు. జోగి సిద్దన్న, మురిడప్ప, లింగన్నకు రూ. 1 లక్ష, గోవిందరాజుకు రూ.500 అడ్వాన్సు మాత్రమే చెల్లించాడు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
కాగా, మహేష్‌రెడ్డి అనే నయవంచుకుడి చేతిలో గతంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వాసులు దారుణంగా మోసపోయారు. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా పోలీసులు కేసులు నమోదు చేసి, మోసగాడి కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉద్దేహాళ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా గుర్తించిన వారు రెండు రోజుల క్రితం బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం సాయంత్రం పోలీసులు ఉద్దేహాళ్‌కు చేరుకుని ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటికే నయవంచకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయి ఉంది. డ్రైవర్లు సైతం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. మహేష్‌రెడ్డికి గొర్రెలు ఇచ్చి మోసపోయిన కాపరులు ఎస్‌ఐ నబీరసూల్‌ను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. కాగా, ఇప్పటి వరకూ ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, యర్రగొండపాలెం పోలీసుల సమాచారంతో గ్రామంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజూ రూ.2 వేలు ఆదాయం అంటూ విసిరిన వల
ప్రకాశం జిల్లా పోలీసుల సమాచారంతో బట్టబయలైన నయవంచన
స్థానిక పోలీసుల రంగ ప్రవేశంతో అజ్ఞాతంలోకి
రూ.1.50 కోట్లు, 90 గొర్రెలతో ఉడాయించిన మోసగాడు


