నేటి నుంచి ఉరవకొండలో చౌడేశ్వరీ ఉత్సవాలు
ఉరవకొండ: స్థానిక చౌడేశ్వరీ అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఓసారి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలకు దేవాంగ, తొగటవీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, అమ్మవారి భారీ కటౌట్లతో ముస్తాబు చేశారు. గురువారం అర్ధరాత్రి జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
శతాధిక వృద్ధుడి మృతి
బెళుగుప్ప: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ మార్గంలో నివాసముంటున్న మోతుబరి రైతు, కళాకారుడు అక్కిశెట్టి దొణప్ప(101) బుధవారం మృతిచెందారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో తన నివాసంలోనే ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మనుమలు, మనుమరాళ్లు, మునిమనువలతో కలసి వందమందికి పైగా ఉన్నారు. రంగస్థల నటుడిగా ధర్మరాజు, కృష్ణుడు పాత్రలతో మెప్పించిన దొణప్ఫ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురుబోధన తీసుకున్న ఆయన అంత్యక్రియలు స్థానిక బ్రహ్మంగారి మఠం ఈశ్వరస్వామి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు.
వ్యక్తి ఆత్మహత్య
బెళుగుప్ప: మండలంలోని గుండ్లపల్లిలో నివాసముంటున్న వేంపల్లి నాగేశ్వరరాజు (53) ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆయన 20 ఏళ్లుగా గుండ్లపల్లిలో అద్దె గదిలో నివాసముంటున్నా డు. డీఎంసీ కంకర యూనిట్‌లో ఆపరేటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తాను నివాసముంటున్న అద్దె గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బెళుగుప్ప పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీలో ఉన్న మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రైలులో వృద్ధురాలి మృతి
ధర్మవరం అర్బన్: రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు మృతిచెందింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. దైవదర్శనం కోసం మంత్రాలయం వెళ్లిన కర్ణాటకలోని తుమకూరు జిల్లా యద్దెనహళ్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ(65) బుధవారం షోలాపూర్ నుంచి హాసన్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుగు ప్రయాణమైంది. అనంతపురం దాటిన తర్వాత అస్వస్థతకు లోనైన ఆమె ధర్మవరానికి రైలు చేరుకునేలోపు మృతి చెందింది. స్థానిక రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే మృతదేహాన్ని రైల్వే పోలీసులు కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
నేటి నుంచి ఉరవకొండలో చౌడేశ్వరీ ఉత్సవాలు


