నేడు హెచ్చెల్సీకి నీరు బంద్
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటి సరఫరాను గురువారం బంద్ చేస్తున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. 2025–26 నీటి సీజన్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది జూలై 17న తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేయగా.. 19వ తేదీ ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్దకు చేరింది. అప్పటి నుంచి 180 రోజులు ఏకధాటిగా నీటి సరఫరా కొనసాగిందని హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. హెచ్చెల్సీ వాటా 25.755 టీఎంసీలు, కేసీ కెనాల్ మళ్లింపు కోటా కింద మరో 3 టీఎంసీలు కలిపి 28.755 టీఎంసీలు కేటాయింపు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 28.843 టీఎంసీల నీరు సరఫరా కాగా.. సరిహద్దులో 25.978 టీఎంసీల నీరు చేరాయి. నేడు టీబీ డ్యాంలో హెచ్చెల్సీకి నీరు బంద్ చేస్తే.. శుక్రవారం సాయంత్రానికి సరిహద్దులో నీటి మట్టం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద 1,050 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక జలాశయంలో 1604.73 అడుగుల నీటి మట్టం వద్ద 28.280 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 3,474 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో రూపంలో వివిధ కాలువల ద్వారా నీరు బయటికి పోతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు.


