
శుక్రవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2023
● టీడీపీలో అగ్రవర్ణాలదే పెత్తనం
● ఉనికి కోసం బడుగు బలహీన వర్గాల నిత్య పోరాటం
● రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ అగ్రకులాల నేతలు చెప్పిందే వేదం
● టూమెన్ కమిటీతో శింగనమలలో శ్రావణిని పక్కకు నెట్టిన వైనం ●
● మడకశిరలో గుండుమల
కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు
● కదిరి నియోజకవర్గంలో
మైనార్టీ మాట.. చెల్లని రూక
● అవమానాలు ఓర్వలేక తలోదారి చూసుకుంటున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమని ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చెప్పినట్లుగానే పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీని క్రమంగా పెత్తందార్లకు అడ్డాగా మార్చారు. టీడీపీలో రాజకీయంగా ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మాభిమానం చంపుకోలేక ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.
శింగనమలలో దారుణంగా..
ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లోనూ టీడీపీకి చెందిన అగ్రకులాల నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత బండారు శ్రావణిని ఇక్కడ డమ్మీగా మార్చారు. టూమెన్ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడును నియమించి అవమానించారు. వీళ్లు చెప్పినట్టే అక్కడ పనులు జరగుతున్నాయి. ఇటీవల శ్రావణి తండ్రిపై దాడి జరిగింది. ఆ సమయంలో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్ జిల్లాలోనే ఉన్నారు. దాడికి పాల్పడిన వారిని మందలించనూ లేదు. దెబ్బలు తిన్న వ్యక్తిని పరామర్శించనూ లేదు.
గుండుమల.. ఎస్సీ నేతల విలవిల
మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మైనింగ్ మాఫియాకు అధిపతిగా చెప్పుకునే గుండుమల తిప్పేస్వామిదే పెత్తనం. ఆయన నియంత వైఖరిని జీర్ణించుకోలేని ఈరన్న వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు పార్టీకి ఆమడదూరం వెళ్లిపోయారు. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలను పట్టించుకునే నాథుడే లేరని ఉన్న కొద్దిపాటి ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే పలు సామాజిక వర్గాల నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ పార్టీకి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న సర్వేలు అధిష్టానానికి వెళ్లినట్లు తెలిసింది.
మైనార్టీ మాట చెల్లని రూక..
2014లో జరిగిన ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్‌బాషా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడాయన మాట చెల్లని రూక అయింది. చెక్‌బౌన్స్ కేసులో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ మాటే పైచేయిగా మారింది. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే కందికుంటను చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇక్కడ మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు.
న్యూస్‌రీల్

సిబ్బందికి సూచనలిస్తున్న నారాయణ స్వామి