హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలను అమలు చేయాలి

Mar 19 2026 7:46 AM | Updated on Mar 19 2026 7:46 AM

అనంతపురం అర్బన్‌: ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య డిమాండ్‌ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలంటూ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట నాయకులు, రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాటమయ్య మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర పథకాల ప్రయోజనాలు కౌలు రైతులకూ అందించాలని, రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు సీసీఆర్‌సీ కార్డు లేకపోయినా పంచనామా నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కౌలు రైతుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వీటీ రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వర్కింగ్‌ అధ్యక్షుడు రాము, నాయకులు రామాంజనేయులు, హనుమంతరెడ్డి, గోపాల్‌, ఈశ్వరయ్య, కె.హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

కాటమయ్య డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement