ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

Mar 19 2026 7:46 AM | Updated on Mar 19 2026 7:46 AM

కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం క్రైం: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు, ఏపీఐఐసీ చల్లా లక్ష్మీప్రసాద్‌, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వెంకటశివుడు యాదవ్‌, డీసీసీబీ చైర్మన్‌ ఎం.కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందాలంటే బస్సు పాస్‌ గుర్తింపు కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలన్నారు. అలాగే అర్హులైన సహాయకులకు 50 శాతం రాయితీతో టికెట్లు జారీ చేస్తారన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, సౌకర్యవంతమైన బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ రామ్మోహన్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, నగరపాలక సంస్థ ఎస్‌ఈ రాజశేఖర్‌, దివ్యాంగులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మురడిలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు

డి హీరేహాళ్‌ (రాయదుర్గం): ప్రసిద్దిగాంచిన డి.హీరేహాళ్‌ మండలం మురడిలోని ఆంజనేయస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహారెడ్డి, అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం విశేష పూజలు, పంచాగ శ్రవణం ఉంటాయి. 20న రాత్రి 7 గంటలకు ముత్యాల పల్లకీ ఉత్సవం, 21న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, 22న లంకా దహనం కార్యక్రమంతో ఉత్సవాలు ముగించనున్నారు.

వ్యక్తిపై కొడవలితో దాడి

యల్లనూరు: పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరుకు చెందిన గురుభాస్కర్‌, పుటకాల లోకేష్‌ ఇద్దరూ బావబామ్మర్దులు. బుధవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ సమయంలో గురుభాస్కర్‌పై పుటకాల గంగయ్య, లోకేష్‌ వేటకొడవలితో దాడి చేశారు. ఘటనలో గురుభాస్కర్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

టీచర్ల సీనియార్టీ జాబితా సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ని ప్రభుత్వ, జెడ్పీ, కార్పొరేషన్‌, మునిసిపాలిటీ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు (సబ్జెక్టుల వారీగా), ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు సిద్ధమయ్యాయి. ‘టిస్‌’ ఆధారంగా జాబితాలు రూపొందించి, www. deoananatapur. blogspot. com లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 24 తేదీలోపు (పనిదినాల్లో) డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. అభ్యంతరం వ్యక్తంచేసే ఉపాధ్యాయుడి పూర్తిపేరు, హోదా, మొబైల్‌ నంబరు, ట్రెజరీ ఐడీ వివరాలతో పాటు సీనియార్టీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని కోరారు. గడువు మీరిన తర్వాత అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలను ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు అప్‌లోడ్‌ చేసిన టిస్‌ వివరాల కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత డీవైఈఓ, ఎంఈఓ, హెచ్‌ఎంలకు మూడుసెట్లు ధ్రువీకరించి అందజేయాలని డీఈఓ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement