ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. రోజుల తరబడి తాగునీరు అందకపోవడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత 15 రోజులుగా తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్న వ్యాసాపురం గ్రామస్తుల కష్టాలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామానికి ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్ మరమ్మతులకు లోనవడంతో సమస్య ఉత్పన్నమైందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పొలాల్లోని బోరు బావుల నుంచి నీటిని సేకరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని వ్యాసాపురం గ్రామస్తులు కోరుతున్నారు.


