ఒత్తిళ్లు తాళలేక యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లు తాళలేక యువతి ఆత్మహత్య

Mar 19 2026 7:46 AM | Updated on Mar 19 2026 7:46 AM

తాడిపత్రి రూరల్‌: స్థానిక గన్నెవారిపల్లికాలనీకి చెందిన నాగసుబ్బరాయుడు కుమార్తె లక్ష్మీప్రసన్న(30) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్‌ విధానం కింద ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న కొంత కాలంగా మానసిక ఒత్తిళ్లతో సతమవుతోంది. ఈ క్రమంలో రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత నెల కర్ణాటకలోని కోలార్‌కు చెందిన విజయ్‌తో వివాహమైంది. ఇటీవల భర్తతో కలసి పుట్టింటికి వచ్చిన ఆమె బుధవారం కోలార్‌కు బయలుదేరాల్సి ఉండగా తెల్లవారుజామునే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడిపత్రి అప్‌గ్రేడ్‌ పీఎస్‌ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

క్రికెట్‌ అంపైర్లకు ముగిసిన శిక్షణ

అనంతపురం: జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ అంపైర్లకు ఆర్డీటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఏప్రిల్‌లో జరగనున్న ఏసీఏ ప్యానెల్‌ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా పలువురికి శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఏడీసీఏ కోశాధికారి జె.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అంపైరింగ్‌ చట్టాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీసీఏ కార్యదర్శి యుగంధర్‌ రెడ్డి (యోగి), సంయుక్త కార్యదర్శి ఎన్‌.సర్దార్‌, కౌన్సిలర్‌ హెచ్‌.అన్సార్‌ ఖాన్‌, అంప్లెర్ల సంఘం అధ్యక్షుడు జోసెఫ్‌, ఏడీసీఏ మాజీ కార్యదర్శి కె.మధు ఆచారి, సీనియర్‌ అంపైర్లు బాల సుబ్రమణియన్‌, కె.మహేష్‌, జి. అక్కులన్న తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీ – ద్విచక్ర వాహనదారుడి మృతి

కూడేరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం అరవకూరు గ్రామానికి చెందిన సదాశివారెడ్డి (38)కి భార్య భార్గవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న సదాశివారెడ్డి బుధవారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో కూడేరుకు వచ్చాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ వైపుగా వెళుతుండగా అదే సమయంలో అనంతపురం నుంచి బళ్లారికి వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సదాశివారెడ్డిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికి ఆయన మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి అదృశ్యం

గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌లోని హోరబ్‌ చర్చి ప్రాంతంలో నివాసముంటున్న రంగాదేవి, రాజేష్‌ కుమార్‌ దంపతుల కుమారుడు రోహిత్‌ కుమార్‌ కనిపించకుండా పోయాడు. స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రోహిత్‌కుమార్‌ను మంగళవారం చిన్నపాటి విషయంలో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement