దోచిపెట్టేందుకు ‘పచ్చ’పాతం

- - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోడ్లు భవనాల శాఖలో భారీగా అవినీతి జరిగింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క భారీ స్కామ్‌కు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ టెండర్‌కు ఓకే చేసి కాంట్రాక్టర్‌కు మేలు చేశారు. కాసుల కోసం లాలూచీ పడి ఖజానాకు చిల్లు పెట్టారు.

టీడీపీ నేతతో కుమ్మక్కు

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు మడకశిరలో కాంట్రాక్టరు. ఈయన కోసం ఆర్‌అండ్‌బీ పెద్దలు సాగిలపడ్డారు. ఇటీవలే మడకశిర నియోజక వర్గంలో పరిగి–యు రంగాపురం, అమరాపురం–మధూడి, మధూడి–గాయత్రి కాలనీలో రోడ్డుపనులకు టెండర్లు పిలిచారు. ఈ మూడు వర్కులకు సంబంధించిన పనుల విలువ రూ.6.45 కోట్లుపైనే. సాధారణంగా ఏదైనా పనికి సింగిల్‌ టెండరు వస్తే వీటిని మళ్లీ టెండరుకు పిలవాలి. కానీ ఇలా చేయకుండా నేరుగా ఇచ్చారు. డీఈలు ఇచ్చిన ఎస్టిమేషన్‌లు (అంచనాలు) కనీసం సమీక్షించలేదు. పైగా అంచనాలు భారీగా పెంచేసి వర్కులు వచ్చారు. ఈ తతంగంలో ఆర్‌అండ్‌బీలో ఉన్నతాధికారి ఒకరు కీలకంగా వ్యవహరించి కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రివర్స్‌ టెండర్‌కు మంగళం

ఏదైనా ఒక పనికి సింగిల్‌ టెండర్‌ దాఖలైతే నిబంధనల ప్రకారం రెండో కాల్‌కు వెళ్లాలి. రెండో కాల్‌కూడా రానప్పుడు మూడో కాల్‌లో ఫైనల్‌ చేయాలి. ఇవేవీ లేకుండా సింగిల్‌ టెండర్‌కే అధికారులు పనులు అప్పగించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 80 శాతం, 20 శాతం స్టేట్‌బ్యాంక్‌ నిధులతో నిర్మించాల్సిన ఈ రోడ్లలో భారీగా కమీషన్లు ముట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ వర్కులకు సంబంధించి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఇందులోనూ మతలబు చేశారు. ఈ పనులన్నీ ఒకే వర్క్‌ కింద చూపితే పెద్ద కాంట్రాక్టర్లు వస్తారన్న ఉద్దేశంతో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి మెలిక పెట్టారు. దీంతో టీడీపీ నేత తమ్ముడికి లబ్ధికలిగేలా ఈ పనులను ముక్కలుగా చేసి ఇచ్చారు. సదరు ఉన్నతాధికారి గతంలో నేషనల్‌ హైవేస్‌లో పనిచేసినప్పుడు కూడా భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

అది నా దగ్గర శాంక్షన్‌ కాలేదు

సంవత్సరం క్రితం కొన్ని పనులకు అనుమతులిచ్చాం. తాజాగా నేను ఏ పనికీ అనుమతి ఇవ్వలేదు. సింగిల్‌ టెండర్‌ వస్తే రెండో టెండర్‌కు వెళ్లాల్సిందే. దీనిపై పూర్తి సమాచారం నాకు తెలియదు. ఒక్కసారి పరిశీలన చేస్తా. మడకశిరలో కాంట్రాక్టర్లు సరిగా ముందుకు రాని మాట వాస్తవమే.

–నయీముల్లా, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ

బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని లేఖ రాశా

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు అధికారులతో కుమ్మకై ్క టెండర్లు వేస్తాడు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత పనులు చేయకుండా వదిలేస్తాడు. అందుకే అతన్ని బ్లాక్‌లిస్టులో పెట్టాలని సీఎంఓకు లేఖ రాశా. ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీని కలిసి చెప్పా. అయినా ఆ కంపెనీని అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచలేదు. మడకశిర నియోజకవర్గంలో చాలా వర్కులు పెండింగ్‌లో ఉంచడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కాంట్రాక్టర్‌ను మార్చాలని చెబితే... మరో సంస్థ పేరుమీద టెండరు వేసి పని అతనికే అప్పగించారు. దీనివెనుక భారీగా సొమ్ములు మారినట్టు నా దృష్టికి వచ్చింది.

–తిప్పేస్వామి, శాసనసభ్యులు, మడకశిర

ఆర్‌అండ్‌బీలో అవినీతి జలగ

టీడీపీ నేత తమ్ముడికి జీహుజూర్‌

కాసులకు కక్కుర్తి పడి సింగిల్‌ బిడ్డర్‌కే గ్రీన్‌ సిగ్నల్‌

రివర్స్‌ టెండరింగ్‌ లేకుండానే అగ్రిమెంటు పూర్తి

ప్రభుత్వానికి భారీగా నష్టం

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top