రెండింతల వాన

- - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ప్రకృతి సహకరిస్తుండటంతో ‘అనంత ’లో కరువుతీరేలా వర్షాలు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా వద్దన్నా వర్షాలు కురుస్తున్నాయి. ముగిసిన వాటర్‌ ఇయర్‌లో రెండింతల వర్షపాతం నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌: ఏటా జూన్‌ ఒకటి నుంచి మే 31 వరకు వర్షపు సంవత్సరం (వాటర్‌ ఇయర్‌) గా పరిగణిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఏటా సాధారణ వర్షపాతం 552.3 మి.మీగా ఉండేది. గతేడాది జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో రెండు జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా సాధారణ వర్షపాతం 512.4 మి.మీగా గుర్తించారు. దేశంలోనే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాగా అనంతపురం కొనసాగుతోంది. ఇలాంటి అత్యల్ప వర్షపాతంగా రికార్డుల్లో ఉన్న జిల్లాలో ఇటీవల కాలంలో అధిక వర్షాలు కురుస్తుండటం విశేషం. ప్రధానంగా జూన్‌ నుంచి అక్టోబర్‌ 15 వరకు నైరుతి రుతు పవనాలు, ఆ తర్వాత ఈశాన్య రుతు పవనాలు ప్రభావం చూపిస్తుండటంతో వర్షాలకు కొదవ లేకుండా పోయింది. జూన్‌ 1 నుంచే ఈ వర్షపాత సంవత్సరం కూడా ఆశాజనకంగా మొదలైంది. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ తొలకర్లు పలకరిస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా అంతటా జలకళ

2022 జూన్‌ 1 నుంచి 2023 మే 31 వరకు సాధారణం కన్నా ఏకంగా 49.5 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 512.4 మి.మీ గాను 766.1 మి.మీ భారీ వర్షపాతం కురిసింది. కొన్ని మండలాల్లో కుంభవృష్టి, కుండపోత వాన పడింది. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిరంతరం ప్రవహించాయి. చిత్రావతి, పెన్నా లాంటి నదీపరివాహక ప్రాంతాలు ప్రవహించడంతో రిజర్వాయర్లు, చెరువులు కూడా నిండటంతో జిల్లా అంతటా జలకళ ఉట్టిపడుతోంది. ప్రధానంగా కీలకమైన జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఖరీఫ్‌లో ‘నైరుతి’ ప్రభావంతో 319.6 మి.మీ సాధారణం కన్నా 40 శాతం అధికంగా 449.2 మి.మీ మేర వర్షాలు పడటంతో 4.04 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. ఖరీఫ్‌ నాలుగు నెలల కాలంలో 33 రోజులు, రబీ, వేసవికి సంబంధించి 8 నెలల కాాలంలో 28 రోజులు వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదయ్యాయి. రోజులో సగటున 2.5 మి.మీ నమోదైతే రెయినీడేగా పరిగణిస్తారు. రైతులు, కూలీలకు ఏడాది పొడవునా చేతినిండా సేద్యపు పనులు ఉండటంతో వలసలు అనే పదానికి పూర్తీగా చెక్‌పడింది. గత నాలుగేళ్లుగా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడుతున్నాయి.

27 మండలాల్లో అధికం

జిల్లాలో ఉన్న 31 మండలాలకుగాను 27 మండలాల్లో సాధారణం కన్నా అధిక వర్షాలు కురిశాయి. గుత్తి, యాడికి, తాడిపత్రి, యల్లనూరులో సాధారణం నమోదు కాగా మినహా మిగతా మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎక్కడా లోటు వర్షపాతం లేకపోవడం విశేషం. గతంలో చాలా సార్లు అత్యంత అల్పవర్షపాతం నమోదైన కూడేరు, ఆత్మకూరులోనే ఈ సారి అత్యధిక వర్షాలు పడటం గమనార్హం. ఈ రెండు మండలాల్లో సాధారణం కన్నా ఏకంగా 165 శాతం అధికంగా నమోదైంది. ఆత్మకూరు సాధారణం 340.9 మి.మీ కాగా 879.7 మి.మీ, కూడేరు సాధారణం 346.6 మి.మీ కాగా ఏకంగా 905.6 మి.మీ నమోదైంది. ఆ తర్వాత పామిడి, కుందుర్పి, రాయదుర్గం, బొమ్మనహాల్‌, డీ.హీరేహాళ్‌, గుమ్మఘట్ట, కంబదూరు, గార్లదిన్నె, కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు తదితర మండలాల్లో మంచి వర్షాలు కురిశాయి.

జిల్లాలో సాధారణ వర్షపాతం 512.5 మి.మీ, కురిసింది 766 మి.మీ

సాధారణం కన్నా 50 శాతం అధికంగా నమోదు

కీలకమైన ఖరీఫ్‌లో 450 మి.మీ వర్షంతో 40.5 శాతం అధికం

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top