కాలవ భరత్‌ డ్రైవర్‌ వీరంగం.. కావాలనే చేశారా? తప్పతాగి వాహనం నడిపారా?

- - Sakshi

రాయదుర్గం: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కుమారుడు కాలవ భరత్‌ వాహన డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్‌ మండలం సింగానహళ్లిలో ఈ నెల ఏడో తేదీ జరిగిన సంగమేశ్వర రథోత్సవానికి డ్రైవర్‌తో కలసి భరత్‌ హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో సింగానహళ్లి– శ్రీధరఘట్ట మార్గమధ్యంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి కాన్వాయ్‌పైకి కాలవ భరత్‌ వాహనం దూసుకెళ్లింది.

అప్రమత్తమైన పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ వారి వేగం నుంచి తప్పించుకోగా, దాని వెనుకనే ఉన్న విప్‌ వాహనాన్ని ఢీకొనడంతో సైడ్‌ మిర్రర్‌ పగిలింది. సకాలంలో మేల్కొన్న విప్‌ వాహన డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని పక్కకు నిలిపారు. దీంతో త్రుటిలోనే ఘోర ప్రమాదం తప్పిందని కాన్వాయ్‌లోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాలవ భరత్‌ వాహన డ్రైవర్‌ అంతటితో ఆగకుండా వెనుక ఉన్న మరో వాహనానికి అడ్డం వస్తూ దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. పోలీసులతో పాటు కాన్వాయ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు పరుగెత్తుకెళ్లి తలుపుతీసి చూడగా డ్రైవర్‌తో పాటు పక్కనే కాలవ భరత్‌ ఉండటాన్ని చూసి నివ్వెరపోయారు.

అక్కడే ఉన్న బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ శివ.. కాలవ భరత్‌ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. విప్‌ కాపు వదిలిపెట్టాలని సూచించారు. ఈ విషయం ఐదు రోజులుగా ఆనోట ఈ నోట నాని ఎట్టకేలకు బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కావాలనే ఇలా చేశారా? లేక తప్పతాగి వాహనం నడిపి ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంపై బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ శివను సంప్రదించగా.. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. అవసరమైతే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామన్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top