అర్నాబ్ తుఫాన్ నుంచి తేరుకోకముందే జిల్లాకు మరో తుఫాన్ ముప్పు
ఎన్నికల హడావిడిలో అధికారులు ● రక్షిత చర్యలపై ఆందోళన
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో ఖరీఫ్ సీజనంతా కరువు కోరల్లో చిక్కుకుంటే గత నెల రోజుల వ్యవధిలో మూడు తుఫాన్‌లు రైతుల్ని బెంబేలెత్తించాయి. అర్నాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులు తర్వాత వచ్చిన తుఫాన్‌కు విషయంలో అంతా ప్రభావానికి గురి కాలేదు. అర్నాబ్ ప్రభావం అనకాపల్లి జిల్లాలో ఉండే అవకాశం ఉందని భావించిన అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. తాజాగా ఆక్వాన్ తుఫాన్ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు–విశాఖ తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో అన్ని శాఖల్లోనూ కలవరం మొదలయ్యింది. అర్నాబ్ కారణంగా జిల్లాలోని 3,139 హెక్టార్లలో వరి, సుమారు 50 హెక్టార్లలో చెరకు పంట నష్టపోయింది. 63 రోడ్లు ధ్వంసం అయిన నేపథ్యంలో జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ నష్టాన్ని, పనులను చేపట్టేందుకు తాత్కాలిక సర్దుబాటు కింద రూ. రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయి. తుఫాన్ ప్రభా విత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తున్న క్రమంలోనే మున్సిపల్, పరిషత్ ఎన్నికల నిర్వహణలో జిల్లా అధికారులు బిజీగా ఉండడం, మరో తుఫాన్ సంభవించడం కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇరుకున పెట్టింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులకు ఆక్వాన్ తుఫాన్ తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది.
ఆక్వాన్ తుపానుపై ముందస్తు ప్రణాళిక
తుమ్మపాల: జిల్లాలో సంభవించబోతున్న ఆక్వాన్ తుఫాన్ ముందస్తు చర్యలలో భాగంగా రెవెన్యూ,
వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, అక్వాకల్చర్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, పోలీసు, రోడ్లు భవనాలు, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ సమష్టిగా వివిధ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ అప్‌డేట్‌కు సంబంధించి కేవలం వాట్సాప్ సందేశాలపై ఆధారపడకుండా మండల స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా మాట్లాడుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని, రాత్రి సమయాల్లో ఇళ్లలోకి నీరు రాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మండల కేంద్రాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని, పంపులు, జనరేటర్లు, జేసీబీలను కనీసం ఐదు రోజుల పాటు సిద్ధంగా ఉంచాలని. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా కోసం అన్ని తాగునీటి ట్యాంకులను 24 గంటలూ నీటితో నింపి స్టాండ్‌బై ఉంచుకోవాలని, మోటార్లు కాలిపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి కారణాలను సాకులుగా చెప్పకుండా, ఎక్కడా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రతి ప్రాంతంలోనూ తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వైద్య శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా క్లీనింగ్ పనులు, బ్లీచింగ్ పౌడర్ వేయడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. అలాగే నీరు, ఆహారం కలుషితం కాకుండా, పాఠశాలలు, కాలేజీలలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఎక్కడైనా జ్వరం కేసులు లేదా వ్యాధుల లక్షణాలు పెరుగుతున్నాయా అనేది నిరంతరం పర్యవేక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. 104, 109, 102 వైద్య సేవల, పశుసంవర్ధక శాఖ అంబులెన్స్ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సముద్రంలోకి వెళ్లినవారంతా సురక్షితంగా వెనక్కి వచ్చేలా చూడాలని, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ శాఖలు పంట నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ వై.సత్యనారాయణ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తీరంలో అప్రమత్తం
నెల రోజుల వ్యవధిలో ఏపీ తీరాన్ని తాకిన రెండు తుఫాన్‌ల ప్రభావాన్ని కోలుకుంటున్న తరుణంలో ఆక్వాన్ తుఫాన్ తీవ్రతపై అధికారుల్లో భయం మొదలయ్యింది. యానాంకు విశాఖ తీరానికి మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18న జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల 19న జిల్లాలో ఎంపీపీ ఎన్నికలు, 20న జెడ్పీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో 19, 20వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలియడంతో అధికారుల్లోనూ కలవరం మొదలయ్యింది. అర్నాబ్ పునరావాస చర్యలు, తుఫాన్ నష్టపరిహార ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే మళ్లీ ఆక్వాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకొనే స్థితిలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల మూడు విడతల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ, ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించాల్సింది పంచాయతీ కేంద్రంగానే. పంచాయతీలకు పాలకులు లేని సమయంలో తుఫాన్‌ల తాకిడి జిల్లాను వణికిస్తోంది.


