తుమ్మపాల: ఈ నెల 17న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో ఎంపిక పోటీల్లో అనకాపల్లికి చెందిన సీకేఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారిణి ఎస్.కె. వహీదా భాషిర్ ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌కు ఎంపికై నట్టు అకాడమీ హెడ్ కోచ్ సీహెచ్.చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వహీదా భాషిర్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి యూనివర్సిటీ క్రీడలకు అర్హత సాధించిందన్నారు. డిసెంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శారదా యూనివర్సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో అండర్–46 కేజీల విభాగంలో ఆమె పోటీపడనుందని పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి జాతీయ స్థాయి యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికకు క్రీడాకారిణి సాధనతో పాటు కోచింగ్, క్రమశిక్షణ దోహదపడ్డాయని కోచ్ తెలిపారు.


