రైతు నుంచి భూమి మ్యుటేషన్‌కు రూ.50వేల లంచం డిమాండ్
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు అల్లుడు శివ
తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్‌ఐ
కె.కోటపాడు: కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎ.నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వారాడ గ్రామానికి చెందిన వృద్ధ రైతు ఇటీవల రీసర్వేలో తన పేరున గల 1 ఎకరా ముప్ఫైమూడున్నర సెంట్లు భూమి వేరే రైతు పేరున పడడంతో మార్పు చేయాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు వారాడ గ్రామంలో సదరు రైతు సాగులో ఉన్న భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాడు. ఆ రైతు సాగులోనే భూమి ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ భూమి మ్యుటేషన్‌కు రూ.50వేలను ఇస్తే వీఆర్వో, డీటీ, తహసీల్దార్‌కు ఇచ్చి తన పని చేయించనున్నట్టు బాఽధిత రైతుకు ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ఆ రైతు జరిగిన విషయాన్ని తన అల్లుడు శివకు వివరించారు. దీంతో ఈ నెల 14న విశాఖపట్నంలో గల ఏసీబీ అధికారులను ఆ రైతు అల్లుడు శివ కలిసి ఎంఆర్‌ఐపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన ఏసీబీ అధికారులు ఫిర్యాదును పరిశీలించి నిజమేనని నిర్ధారణకు వచ్చినట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి విలేకరులకు తెలిపారు. బాధిత రైతు అల్లుడు శివకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు కోరడంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే శివ నుంచి నాగేశ్వరరావు రూ.50వేలను తీసుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న నాగేశ్వరరావును రెడ్ హేండడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ ఎంఆర్‌ఐ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అవినీతికి పాల్పడే అధికారులపై ఫిర్యాదులు ఉంటే ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు సుప్రియ, పృధ్వీతేజ, శ్రీనివాసరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
రెండు నెలల కాలంలోనే రెండోమారు ఏసీబీ దాడులు
అవినీతి అధికారుల లెక్కలను సరి చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే వారాడ వీఆర్వో సూర్యనారాయణను లంచం తీసుకుంటుంగా రెడ్‌హేండడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలల పూర్తయ్యే సరికి అదే కార్యాలయంలో మరలా ఇప్పు డు ఎంఆర్‌ఐ నాగేశ్వరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచాలను ఈ అధికారులు సాక్షాత్తూ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడడం విశేషం. గతంలో పట్టుబడ్డ వీఆర్వోతో పాటు ప్రస్తుతం పట్టుబడ్డ ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు ఇద్దరూ వారాడ గ్రామంలో గల భూమిని మ్యుటేషన్‌లను చేసేందుకు లంచం కోసం పట్టుబట్టి ఆ గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదుతోనే పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల దాడులతో లంచగొండి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.


