రీల్స్ సదస్సుకు
● నేటి నుంచి రెండు రోజుల పాటు సీఐఐ భాగస్వామ్య సదస్సు
● రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమంటూ ప్రభుత్వ ప్రచారం
● చంద్రబాబుతో రీల్స్ చేసేందుకు లోకేష్ టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు
● గత సదస్సుల ఎంవోయూలు, వాస్తవ పెట్టుబడులపై వీడని ప్రశ్నలు
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం పెట్టుబ
డుల సదస్సుకు ముస్తాబైంది.. కానీ తెరవెనుక
ఏర్పాట్లు మాత్రం ప్రచార పండుగ కోసమే సాగు
తున్నాయి. కెమెరాలు, డ్రోన్లు, సోషల్ మీడియా
బృందాలతో విశాఖలో సందడి నెలకొంది. పరి
శ్రమలు ఎన్ని వస్తాయి? యువతకు ఎన్ని
ఉద్యోగాలు వస్తాయి? అన్నదానికంటే.. చంద్రబా
బుతో ఎన్ని రీల్స్ తీయాలి? ‘బ్రాండ్ సీబీఎన్’ను
సోషల్ మీడియాలో ఎలా ఆకాశానికెత్తాలి?
అన్నదానిపైనే అధికార పార్టీ దృష్టి పెట్టిందన్న
విమర్శలున్నాయి. ఇందుకోసం లోకేష్ టీమ్
ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార బృందం
ఇప్పటికే విశాఖలో మోహరించింది.
పారిశ్రామిక భాగస్వామ్యానికి వేదిక కావాల్సిన
36వ సీఐఐ సమ్మిట్.. రాజకీయ ప్రచారానికి,
ఫొటోషూట్లకు వేదికగా మారుతోందన్న
విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేటి నుంచి
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో
పెట్టుబడుల కంటే ప్రచార ఆర్భాటమే
హైలైట్ కానుందా అన్న చర్చ సాగుతోంది.
పెట్టుబడుల కన్నా ప్రచారానికే పెద్దపీట
సాక్షి, విశాఖపట్నం: ప్రతి సదస్సులోనూ లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలంటూ భారీ ప్రకటనలు చేయడం.. ఆ తర్వాత వాటి అమలుపై స్పష్టత లేకపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. ఈసారి ఒక్క సదస్సు ద్వారానే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమని ప్రభుత్వం నెల రోజులుగా ప్రచారం చేస్తోంది. 58 దేశాల నుంచి సుమారు 3,800 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో భారీగా ఎంవోయూలు కుదరనున్నాయని ప్రకటిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సదస్సును ప్రారంభించనున్నారు. 12, 13 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరగనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఎన్ని పరిశ్రమలుగా మారాయి? స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానాలు లేవు.
మరోసారి అంకెల గారడీ
చంద్రబాబు ప్రభుత్వ ప్రచారంలో భారీ అంకెలు, ఆకర్షణీయమైన ప్రజెంటేషన్లకు కొదవ ఉండదు. గతంలో అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో విదేశీ సంస్థలతో రూపొందించిన గ్రాఫిక్స్ చూపించి ప్రజల్లో భారీ అంచనాలు కల్పించారు. ఇప్పుడు అదే తరహాలో పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల గణాంకాలతో పారిశ్రామిక ప్రగతి వచ్చేసిందనే ప్రచారానికి సీఐఐ సదస్సును వేదికగా చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. గత సదస్సుల పెట్టుబడుల లెక్కలు పరిశీలిస్తే ఈ సందేహాలకు మరింత బలం చేకూరుతోంది.
● 2016, 2017, 2018లో నిర్వహించిన సదస్సుల్లో దాదాపు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరినట్లు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాగ్ నివేదికల ప్రకారం వీటిలో వాస్తవ రూపం దాల్చినవి 25 నుంచి 30 శాతం మాత్రమే. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలనే మళ్లీ లెక్కల్లో చూపినట్లు కూడా నివేదికలు స్పష్టం చేశాయి.
● 2025లో నిర్వహించిన సదస్సులో ఏకంగా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 16.31 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే పార్లమెంట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం రూ.5 వేల కోట్లుగానే ఉన్నట్లు తేలింది. భారీ ప్రకటనలకు, వాస్తవ పెట్టుబడులకు మధ్య వ్యత్యాసంపై అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయి.
● జూన్ 2024 నుంచి ఇప్పటివరకు: రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, వీటిలో 267 ప్రాజెక్టులు అమలు దశకు చేరుకున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే పెట్టుబడుల పురోగతి, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు సరిపోతున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
● ప్రస్తుత సదస్సు కోసం ఆరు సమావేశాలు నిర్వహించి, రూ.86,522 కోట్ల విలువైన 194 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా 1.4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందాల అమలుపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
● ప్రతిసారీ లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేయడం, ఆ తర్వాత వాటి కార్యాచరణపై వివరాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంవోయూలు కుదరడమే పారిశ్రామిక ప్రగతికి కొలమానం కాదని, భూముల కేటాయింపు, నిర్మాణాలు, ఉత్పత్తి ప్రారంభం, స్థానికులకు ఉద్యోగాల కల్పనతోనే పెట్టుబడుల ఫలితాలు తెలుస్తాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈసారీ.. పెట్టుబడుల ప్రహసనమేనా.?
సుమారు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. భారత్ ఫోర్జ్, కియా, రెన్యూ పవర్ లాంటి దిగ్గజ సంస్థలు వస్తున్నప్పటికీ, ఈ సదస్సు మొత్తం సోషల్ మీడియా రీల్స్, ఫోటోషూట్‌ల చుట్టే తిరుగుతోందన్న విమర్శలొస్తున్నాయి. పదుల సంఖ్యలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక పాస్‌లు ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యక్రమాలను రీల్స్, ఫొటోషూట్లతో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేయడం చూస్తుంటే.. ఇది పెట్టుబడుల భాగస్వామ్య సదస్సా? లేక ప్రచార రీల్స్ పోటీయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


