తుమ్మపాల: ప్రాణాపాయం పొంచి ఉందని గతంలో మూసివేసిన రాయి క్వారీల్లో మళ్లీ రాళ్ల వేట కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో ఎత్తైన రాతి మేటలు కూలిపోవడంతో క్వారీలు మరింత ప్రమాదకరంగా మారాయి. మరోవైపు క్వారీ గోతుల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నా.. కొందరు రాయి వ్యాపారులు మాత్రం ప్రమాదాన్ని లెక్కచేయకుండా ట్రాక్టర్లతో లోపలికి వెళ్లి రాళ్లను తరలిస్తున్నారు. అనకాపల్లి మండలం తారకరామారావు కాలనీ సమీపంలోని క్వారీల్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వర్షాలకు నానిన కొండచరియలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రాతి మేటలు ఎప్పుడైనా విరిగిపడే ప్రమాదం ఉంది. నీటితో నిండిన లోతైన గోతులు మరింత ముప్పుగా పరిణమించాయి. అయినా ట్రాక్టర్లతో రాళ్లను తరలిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ క్వారీల్లో రాళ్లు జారిపడి పలువురు గాయపడటంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో అప్పట్లో అధికారులు క్వారీ తవ్వకాలను నిలిపివేశారు. అయితే ప్రస్తుతం క్వారీల పరిసరాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రక్షణ కంచె లేకపోవడం, కాపలా సిబ్బందిని నియమించకపోవడంతో ట్రాక్టర్లు యథేచ్ఛగా లోపలికి వెళ్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకర క్వారీల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వాటిని పూర్తిగా మూసివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


