రావికమతం: మండలంలోని తట్టబంద గ్రామంలో సుమారు 46 ఎకరాల ప్రభుత్వ భూమిని మండల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో బుధవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మండలంలోని సర్వే నంబర్ 285లో 2013లో ఎనిమిది మంది మాజీ సైనికులకు 29 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. వీరికి డి.పట్టాలతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారు. అయితే ఇంతవరకు సంబంధిత భూముల్లో సాగు చేపట్టలేదని ఆర్ఐ రమణబాబు తెలిపారు. కేటాయించిన భూములను సాగు చేయనందున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అసైన్మెంట్ నిబంధనల ప్రకారం డి.పట్టాలను రద్దు చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వివరించారు.
ఈ మేరకు మాజీ సైనికులకు కేటాయించిన 29 ఎకరాలతో పాటు, అదనంగా ఆక్రమణలో ఉన్న మరో 17 ఎకరాలను గుర్తించి మొత్తం 46 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఐ వెల్లడించారు.


