రిజర్వేషన్ల మార్పు..
నేడు కలెక్టరేట్లో సమీక్ష?
●13 పంచాయతీల్లో రిజర్వేషన్ల రగడ
●హైకోర్టులో వాదనలు ● గెజిట్ 89తో గందరగోళం
సాక్షి, అనకాపల్లి: మరో 24 గంటల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో అనకాపల్లి మండలంలో రిజర్వేషన్ల మార్పు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. మండలంలోని 26 పంచాయతీలకు తొలుత ప్రకటించిన రిజర్వేషన్లలో 13 గ్రామాలకు సంబంధించి మార్పులు చేస్తూ విడుదల చేసిన గెజిట్ నంబర్ 89 ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఈ వ్యవహారంపై దిబ్బపాలెం, బవులువాడ, రొంగళివానిపాలెం గ్రామాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో బుధవారం జరిగిన విచారణలో వెలువడిన మార్గదర్శకాలు కీలకంగా మారాయి. జీవో నంబర్ 154 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారా? లేదా? అన్నది తేలితేనే గెజిట్ 89 భవితవ్యం స్పష్టమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 646 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, తొలి విడతలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ ఫలితం ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
హైకోర్టును ఆశ్రయించిన మూడు గ్రామాలు
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 12న అనకాపల్లి మండలంలోని 26 పంచాయతీలకు సంబంధించి గెజిట్ నంబర్ 86 విడుదల చేశారు. ఇందులో గ్రామాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. ఆయా రిజర్వేషన్ల ఆధారంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్న సమయంలో అక్టోబర్ 26న మరో గెజిట్ నంబర్ 89 విడుదలైంది. దీని ప్రకారం 26 పంచాయతీల్లో 13 గ్రామాల రిజర్వేషన్లను మార్చారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లలో పొరపాట్లను సరిచేసేందుకే మార్పులు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, అప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లను ఒక్కసారిగా మార్చడంపై ఆయా గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దిబ్బపాలెం, బవులువాడ, రొంగళివానిపాలెం గ్రామాలకు చెందిన ప్రతినిధులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో జీవో నంబర్ 154 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులో లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత జాబితాలో మార్పులు చేయాల్సి ఉంటుందని కోర్టు సూచించినట్లు సమాచారం. అయితే, కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలు అధికారికంగా అందిన తర్వాతే తదుపరి చర్యలపై స్పష్టత రానుంది.
పొరపాటు ఎక్కడ జరిగింది?
గెజిట్ 86లో పొరపాట్లు జరిగాయా? లేక గెజిట్ 89 విడుదల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. రిజర్వేషన్ల మార్పునకు అధికారికంగా ఎవరైనా ఫిర్యాదు చేశారా? రాజకీయ ఒత్తిళ్లు లేదా సిఫారసుల ప్రభావం ఉందా? అన్న అంశాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. జీవో 154లోని నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారా? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కేటాయింపులో పాటించాల్సిన విధానాలను అనుసరించారా? అన్నది పరిశీలించాల్సి ఉంది.
రొంగళివానిపాలెంపై సమాధానం ఏదీ?
రిజర్వేషన్ల మార్పునకు నిరసనగా రొంగళివానిపాలెం గ్రామస్తులు పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. గ్రామస్తులంతా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ రెండు ఓట్లు పోలవడం, ఇందుకు సిబ్బందిపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందన్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాలేమిటో కూడా అధికారులు తేల్చాల్సి ఉంది. గెజిట్ 86లోనే పొరపాట్లు జరిగితే ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారు? గెజిట్ 89లో మార్పులు చేయడానికి ప్రాతిపదిక ఏమిటి? అన్న ప్రశ్నలకు అధికారికంగా సమాధానాలు రావాల్సి ఉంది. లేదంటే స్థానిక ఎన్నికలపై నెలకొన్న అనుమానాలు మరింత బలపడే ప్రమాదం ఉంది.
హైకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ అందిన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో గెజిట్ నంబర్ 89పై సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీవో 154 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులో ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మార్పులు తప్పనిసరి కావచ్చు. నిబంధనల ప్రకారమే రిజర్వేషన్లు ఖరారైనట్లు నిర్ధారణ అయితే గెజిట్ 89 ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. రిజర్వేషన్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన ఆర్డీవో పర్యవేక్షణ, ఉన్నతాధికారుల ఆదేశాలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రపైనా సమీక్ష జరగాల్సి ఉంది. ఆ సమయంలో తాను సెలవులో ఉన్నానని ఎంపీడీవో పేర్కొన్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో రిజర్వేషన్ల మార్పు ప్రక్రియలో బాధ్యత ఎవరిదన్నది కూడా తేలాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుకు పరిగణనలోకి తీసుకున్న జనాభా వివరాలు, ఆయా గ్రామాల్లో ఎస్టీ, ఎస్సీ జనాభా నిష్పత్తి, రిజర్వేషన్ల ఎంపికకు అనుసరించిన ప్రాతిపదికలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారా? ఒకే విధమైన నిబంధనలను అన్ని గ్రామాలకూ వర్తింపజేశారా? అన్నది స్పష్టం కావాలి.


