కోటవురట్ల: మండలంలోని పాములవాకలో గల పట్టాలమ్మతల్లి ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ పలు దేవతల విగ్రహాలు కొలువుదీరడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. పచ్చని పొలాలు.. సమీపంలో కొండలు, పంట కాలువలు, చెరువుల నడుమ ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉండటంతో ఇటు ఆధ్యాత్మికంగా, అటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ఆలయాన్ని పాములవాక గ్రామానికి చెందిన ఎస్.వి.రమణ 2005లో నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన పట్టాలమ్మతల్లి పండగను గ్రామస్తులు మూడేళ్లకోసారి ఘనంగా జరుపుతారు. తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మొదట పట్టాలమ్మతల్లి ఆలయంగా ప్రసిద్ధి చెందగా, అనంతరం పలు దేవతామూర్తుల చేరికతో నవదుర్గల పట్టాలమ్మతల్లి ఆలయంగా మారింది.
పర్యాటక కేంద్రంగా..
విశాలమైన ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో సమస్త దేవతామూర్తులను దర్శించుకునే అవకాశం ఇక్కడ కలుగుతోంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి వెళుతుంటారు. కార్తీక మాసంలో ఆలయం మరింత సందడిగా మారుతుంది. భక్తుల సందర్శన, వనభోజనాలతో నెలరోజులూ సందడిగా ఉంటుంది. ఇక్కడ కొలువు దీరిన పట్టాలమ్మతల్లితో పాటు నవదుర్గలు, లక్ష్మీగణపతు లు, అష్టలక్ష్ములు, నవ గ్రహాలు, పంచముఖ ఆంజనేయుడు, అంకాలమ్మ, శివుడు, షణ్ముకుడు, గోపాలుడు, గోవిందుడు, గోమాతల విగ్రహాలను దర్శించుకోవడం భక్తులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.
నిత్యాన్నదానం
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ధర్మకర్త రమణ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాతల సహాయ సహకారాలతో అన్నదానం జరుపుతున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ అన్నప్రసాద నిలయాన్ని ఏర్పాటు చేశారు. పలు జిల్లాల నుంచి వచ్చే భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని సాయంత్రం వరకు భక్తి భావంతో గడిపి వెళుతుంటారు. మధ్యాహ్నం 11 గంటల నుంచే అన్నదానం ప్రారంభం కావడంతో అన్ని వయస్సుల భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటోంది.
ప్రత్యేక ఏర్పాట్లు..
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త రమణ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు ఆధ్యాత్మికంగా మరింత విశిష్టత వచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 17వ తేదీన శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. దీంతో పాటు కోటి దీపార్చన నిర్వహిస్తున్నారు.
అందరి ఇష్ట దైవాలు ఒకే చోట ఉండేలా..
పట్టాలమ్మతల్లి ఆలయాన్ని 2005లో నిర్మించాం. మొదట పట్టాలమ్మతల్లిని మాత్రమే ప్రతిష్టించగా అమ్మవారి మహిమతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అందరి ఇష్ట దైవాలు ఒకే చోట కొలువుదీరేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, వారికోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నాం.
– ఎస్.వి.రమణ, ఆలయ ధర్మకర్త, నవదుర్గల పట్టాలమ్మతల్లి ఆలయం


