కె.కోటపాడు: పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తగినాన స్వామినాయుడు(41) బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో గడ్డిలో నుంచి వచ్చిన పాము కాటు వేయడంతో స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి వెంటనే కె.కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామినాయుడు మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న స్వామినాయుడు మృతితో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


