దీపకాంతులతో వెలుగులీనుతున్న యలమంచిలి
ఆకట్టుకుంటున్న భారీ విద్యుద్దీపాలంకరణలు, సెట్టింగులు
ఎగ్జిబిషన్లు, రకరకాల స్టాళ్లతో పట్టణంలో సందడి
పాతవీధి రహదారిపై విద్యుద్దీపాలతో పెట్టిన శివలింగం
విశేష పూజలందుకుంటున్న పాతవీధి
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
యలమంచిలి రూరల్: జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా జరుగుతున్నాయి. దీపావళి నుంచి నాగులచవితి వరకు ఐదు రాత్రులు జరిగే ఈ ఉత్సవాలకు యలమంచిలి పట్టణంలో ప్రధాన రహదారి, తులసీనగర్, పాతవీధి, దిమిలిరోడ్డు ప్రాంతాలన్నీ విద్యుద్దీపాలతో మెరిసిపోతున్నాయి. రహదారులకు ఇరువైపులా రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేసిన హిందూ దేవతామూర్తుల సెట్టింగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన రహదారిపై స్టేట్ బ్యాంకు కూడలి వద్ద ఒకవైపు పార్వతీదేవి, మరోవైపు హనుమంతుడు, దిమిలి రోడ్డు కూడలి వద్ద కనకదుర్గమ్మ, అంతర్గత రహదారుల్లో కుమారస్వామి, శివలింగం, ఆలయ నమూనాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. గురప్ప కల్యాణ మండపంలో ఎగ్జిబిషన్, రహదారులకు ఇరువైపులా పెట్టిన వివిధ రకాల స్టాళ్లు సందర్శకులు, కొనుగోలుదారులతో పట్టణంలో పూర్తి సందడి నెలకొంది.
ధాన్యలక్ష్మిగా భూలోకమాంబ అమ్మవారు
ఉత్సవాల్లో భాగంగా తులసీనగర్ భూలోకమాంబ అమ్మవారు, పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు కొనసాగుతున్నాయి. బుధవారం భూలోకమాంబ అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. అమ్మవారి ఆలయం దీపకాంతులతో మెరిసిపోతోంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి పలువురు భక్తులు స్వయంగా ప్రసాదాలు తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు నడిగట్ల బ్రదర్స్ ఉచితంగా ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా ఆలయాల ఉత్సవ కమిటీల ప్రతినిధులు మళ్ల కొండబాబు, మళ్ల నాగరాజు, కర్రి జానకిరాం, కర్రి రవి, యల్లపు శేషు, పి.మధు, సూరిశెట్టి అశోక్, పిల్లా శ్రీను, భీశెట్టి నాగరాజు పర్యవేక్షిస్తున్నారు.


