స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు ● నగదు, మద్యం పంపిణీ.. యథేచ్ఛగా రిగ్గింగ్‌ ● అక్రమాలపై వామపక్షాల నిరసన

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం సాగించిన అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తక్షణమే అరికట్టాలని సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం అనకాపల్లి నెహ్రూచౌక్‌ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా భయభ్రాంతులకు గురిచేయడం, రిటర్నింగ్‌ అధికారుల చేతుల్లో నుంచి నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేశారని విమర్శించారు. బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. అధికార కూటమి సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.శంకరరావు, పట్టణ కార్యదర్శి తాకాశి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకుడు వై.ఎన్‌.భద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement