సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న ప్రచార ఆర్భాటాల వెనుక ఉన్న అసలు నిరుద్యోగ నిజరూపం ఇది. కాగితాలపై కోట్ల పెట్టుబడులు, వేదికలపై లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం మైకులు పగులగొడుతున్నా, విశాఖ వీధుల్లో నిరుద్యోగ యువత పడుతున్న ఆకలి కేకలు చేదు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. ఎంవోయూల అంకెలతో నిరుద్యోగాన్ని తరిమేశామంటూ చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ప్రచారాలు చేస్తుంటే, సత్యం జంక్షన్ సమీపంలో ఓ చిన్నపాటి బీపీవో ఉద్యోగం కోసం వందలాది మంది యువత ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో పడిగాపులు కాశారు. అరకొర జీతానికై నా సరే బతుకుదెరువు దొరుకుతుందేమోనని చదువుకున్న చేతులు ఆర్తిగా ఎదురుచూస్తున్న దృశ్యాలు విశాఖ వీధుల్లో కనిపించాయి. కళ్లెదుట కనిపిస్తున్న ఈ తీవ్ర నిరుద్యోగ నినాదాలు ప్రభుత్వ అభివృద్ధి అద్దాలకు కనిపించకపోవడం గమనార్హం. వాస్తవాలను తొక్కేసి, రీల్స్ రంగులద్ది, ప్రచార ఆర్భాటాలతో మరోసారి పెట్టుబడుల సదస్సు పేరుతో నిరుద్యోగుల ఆశలతో ఆటలాడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


