కూటమికి కాలుష్య సెగ.. ఎన్నికల బహిష్కరణ! | - | Sakshi
Sakshi News home page

కూటమికి కాలుష్య సెగ.. ఎన్నికల బహిష్కరణ!

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

రాయినపేటలో వెంటాడుతున్న

కలుషిత గాలి, నీటి సమస్య

పాలకులకు, అధికారులకు

మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

131 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరం

పంచాయతీ ఎన్నికలూ

బహిష్కరిస్తామని హెచ్చరిక

తగరపువలస: కలుషిత గాలి.. విషతుల్యమైన నీరు.. భరించలేని దుర్వాసన.. ఇళ్లలో ఉండలేని దుస్థితి.. చివరకు అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఓటు హక్కునే వదులుకున్నారు ఆ గ్రామస్తులు. ఆరు నెలలుగా కాలుష్య సమస్యతో అల్లాడుతున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరించి తమ ఆగ్రహాన్ని చాటారు. భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని రాయినపేట గ్రామస్తులు గురువారం జరిగిన ప్రాదేశిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎంపీఈపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గ్రామానికి చెందిన 131 మంది ఓటు వేయాల్సి ఉండగా.. ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి నచ్చజెప్పినా తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఆరు నెలలుగా నరకయాతన

తాళ్లవలస పంచాయతీలోని చిన్నిపేట, యాతపేట, గొల్లల తాళ్లవలసతో పాటు ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని పలు కార్పొరేట్‌ విద్యాసంస్థలు శుద్ధి చేయని వ్యర్థాలను సమీపంలోని చెరువులోకి నేరుగా వదులుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది మే నెల నుంచి రాయినపేట, పెద్దిపాలెం గ్రామాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోంది. చెరువులో నీరు అడుగంటడంతో వ్యర్థాలు రాయినపేట వరకు చేరుతున్నాయి. సమీపంలోని రక్షిత మంచినీటి పథకం బోరులోకి కూడా కలుషిత నీరు చేరడంతో తాగునీరు సైతం విషతుల్యంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలి పీల్చినా.. నీరు తాగినా ఇబ్బందులే

దుర్వాసన భరించలేక ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. కలుషిత గాలి, నీటి కారణంగా చర్మ అలర్జీలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం, జల్‌ జీవన్‌ మిషన్‌ బోర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిలో దుర్వాసనతో పాటు పురుగులు, చిన్న కప్పలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువును ఆనుకుని ఉన్న బంగారమ్మ ఆలయం మునిగిపోయిందని, గత మూడు రోజులుగా శుద్ధమైన తాగునీరు కూడా అందడం లేదని వాపోతున్నారు.

అధికారుల చుట్టూ తిరిగినా..

కాలుష్య సమస్యపై గత ఆరు నెలలుగా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ పంచకర్ల సందీప్‌తో పాటు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. రెండు పంచాయతీల ప్రజలు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ తమ గోడు వెళ్లబోసుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వాపోతున్నారు.

పంచాయతీ ఎన్నికలూ

బహిష్కరిస్తాం

అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలకే పరిమితమవుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే తమ గ్రామానికి వస్తున్నారని, మిగిలిన రోజుల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు.

గాలి, నీరు కలుషితమయ్యాయి

చెరువులోకి చేరుతున్న వ్యర్థాలతో రాయినపేటలో గాలి, నీరు తీవ్రంగా కలుషితమయ్యాయి. దుర్వాసనతో గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇళ్లలోని బోర్ల నీరు తాగడానికి పనికిరావడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించాలనే ఎన్నికలను బహిష్కరించాం.

– రాయిన రమేష్‌

ఎన్నికలప్పుడే గుర్తుకొస్తాం

ఆనందపురం, భీమిలి మండలాల మధ్య ఉన్న చిన్న గ్రామం కావడంతో ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు మేం గుర్తుకు రావడం లేదు. ఆరు నెలల క్రితం సమస్యను వివరించినప్పుడు మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోలేదు.

– నిమ్మకాయల ఆదినారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement