అర్నాబ్ తుపాను...
జిల్లాకు
● గిరిజన మండలాలకు రూ.2 లక్షల చొప్పున అత్యవసర నిధులు
● తీరంలోని 6 మండలాల్లో ఫ్లడ్ స్టోర్లు, తుపాను సహాయక కేంద్రాలు సిద్ధం చేయాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
తుమ్మపాల : అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లో ఫ్లడ్ షెల్టర్లు, రిలీఫ్ సెంటర్లను సోమవారం రాత్రి నుంచే అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
కచ్చా ఇళ్లు, గుడిసెలు, టిన్ షెడ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రిలీఫ్ సెంటర్లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. గిరిజన మండలాలకు ఒక్కోదానికి రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. గతంలో పంపిణీ చేసిన తాళ్లు, సోలార్ లైట్లు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు.
కోటవురట్ల నుంచి దేవరాపల్లి వరకు ఎనిమిది గిరిజన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను పీహెచ్‌సీ, సీహెచ్‌సీ లేదా సురక్షిత ప్రాంతాల్లోని రిలీఫ్ సెంటర్లకు తరలించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రమాదకర చెట్లు, కొమ్మలు, హోర్డింగులను ముందుగానే తొలగించే చర్యలు చేపట్టాలన్నారు.
రోడ్ల క్లియరెన్స్, చెట్ల కొమ్మల తొలగింపునకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బందిని సిద్ధం చేయాలని, ప్రతి ఐదు కిలోమీటర్లకు జేసీబీ, టిప్పర్‌తో పాటు పది మంది సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలోని సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల వివరాలను సేకరించి అధికారుల గ్రూపులో ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పంట నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే స్పందించాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌ఓ వై. సత్యనారాయణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
29 వరకు పాఠశాలలకు సెలవులు
తుమ్మపాల : తుఫాను అర్నాబ్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ నెల 27 నుంచి 29 వరకు సెలవులు ప్రకటించినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.


