సాక్షి,అనకాపల్లి: ప్రాదేశిక ఎన్నికల్లోనూ కూటమి నేతల మధ్య జెడ్పీటీసీ సీట్ల పంచాయితీ తేలలేదు. ఇంకా మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. నామినేషన్ల దాఖలకు శుక్రవారమే తుది గడువు కావడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో కూటమి సర్దుబాటు కింద ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావాల్సి ఉన్నప్పటికీ టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ పడి నామినేషన్లు వేస్తున్నారు. ఒకవైపు సీట్ల పంపకాలపై కానరాని స్పష్టతతో ఆయా పార్టీల ఇన్‌చార్జుల సూచన మేరకు నామినేషన్లు దాఖలు చేస్తుంటే, నేతలు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయకుండా చోద్యం చూస్తున్నారు.
పోటాపోటీగా టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లు
జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు పలు మండలాల్లో నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. నామినేషన్ దాఖలుకు శుక్రవారం మాత్రమే చివరి రోజు అయినప్పటికీ తుది జాబితా ప్రకటించకపోగా, మరోవైపు టికెట్లు ఆశిస్తున్న వారి అలకలు, బుజ్జగింపులు తీర్చడానికి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఆపసోపాలు పడుతున్నారు. తొలి రెండు రోజులు ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో హడావిడి జరగ్గా, ఇప్పుడు రేసులో ఉన్న వారంతా నామినేషన్ వేసి స్క్రూట్నీ, ఉపసంహరణ వరకూ వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉందని ఆవేదన చెందుతున్న అభ్యర్థులు కూటమి నాయకుల తీరుతో మదనపడుతున్నారు.
సీట్ల పంపకాల్లో చేతులెత్తేస్తారా?
అచ్యుతాపురం మండలంలో బీజేపీ తరపున రెండు నామినేషన్లు, టీడీపీ తరపున ఒక నామినేషన్ దాఖలు కావడం బట్టి పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మునగపాక మండలంలోనూ ఇదే తరహా గందరగోళం ఏర్పడింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కూటమి తరపున ఎంపీపీ రేసులో ఉన్న జనసేన నేత ఏకంగా నాలుగు సెగ్మెంట్లలో నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహా పరిస్థితి జిల్లా మొత్తం ఉందని తెలుస్తోంది. ఏ పార్టీకి చెందిన ఇన్‌చార్జి ఆయా పార్టీల ఔత్సాహికులకు ముందు నామినేషన్ దాఖలు చేయండి.. బీఫారం మీకే ఇస్తామని చెప్పడంతో అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎమ్మెల్యే సీటు కోసం కూడా ఇలానే జాప్యం వహిస్తే, నేతలు ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో చేతులెత్తేయడంతో వేచి చూసే ధోరణి వల్లే అన్ని పార్టీల నేతలు నామినేషన్ దాఖలు చేయాల్సిన దయనీయ స్థితి ఏర్పడిందని కూటమి శ్రేణులు వాపోతున్నాయి.
జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల వెల్లువ
అనకాపల్లి: జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం రెండో రోజూ కొనసాగింది. గురువారం స్థానిక మెయిన్‌రోడ్డులోని జెడ్పీ కార్యాలయంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి డి.సత్యనారాయణమూర్తికి అందజేశారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు యర్రంశెట్టి శ్రీనివాసరావు(రోలుగుంట), దొడ్డి వెంకటరావు(చోడవరం), తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్(మాడుగుల), చిక్కాల పద్మరాజేశ్వరి(పాయకరావుపేట), కర్రిలక్ష్మి(సబ్బవరం), ఆడారి కమల కుమారి(మునపాక), రెడ్డి జగన్‌మోహన్(కోటపాడు), బొడ్డేడ లక్ష్మి(కశింకోట), బోళెం వెంకటేష్(నర్సీపట్నం), రుత్తల రాజుబాబు(మాకవరపాలెం), కాకర వెంకటరావు(నక్కపల్లి), వేచలపు డిండిమ వెంకటవాణి, గొర్రుపోటు రమాదేవి (దేవరాపల్లి), మాదాల ప్రవీణ్‌కుమార్(గొలుగొండ),తదితరులు నామినేషన్లు వేశారు.


