రావికమతం/రోలుగుంట: భద్రతా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లును వినియోగిస్తూ నిరంతర నిఘా ఉంచినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. రోలుగుంట కేంద్రం బయట పలువురు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గుమిగూడి ఉండటం చూసి కాస్త దూరం పాటించాలని సూచించారు. నామినేషన్ల సంఖ్యను ఏఆర్వోలు ఎస్. నాగమ్మ, వి.ఎస్.నాగేశ్వరరావులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థితోపాటు మరో ఇద్దరినే లోపలికి అనుమతించాలని ఆర్వో కొండలరావుకు సూచించారు. శిథిలాస్థితిలో ఉన్న అడ్డసరం పోలింగ్ కేంద్రం సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, అన్ని మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. 30వ పోలీస్ యాక్టు అమల్లో ఉన్నందున ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. కొత్తకోట, రోలుగుంట ఎస్‌ఐలు శ్రీనివాస్, రామకృష్ణారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యర్థులకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు
బుచ్చెయ్యపేట: నామినేషన్ వేసే అభ్యర్థులకు ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఆయన బుచ్చెయ్యపేటలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్, ఎన్నికల పోలింగ్ కేంద్రాలు వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ సరళిపై ఎన్నికల సిబ్బంది గోపాలరాజు, ఎంపీడీవో శివప్రసాద్, తహసీల్దార్ లక్ష్మిలతో ఎస్పీ చర్చించారు. కొత్తకోట సీఐ పి. కోటేశ్వరరావు, ఎస్‌ఐ పి. మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.


