నర్సీపట్నం: అసత్యాల చంద్రబాబుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని 34, 35, 36 వార్డుల పరిధి ధనిమరెడ్డి వీధి, శివపురం, బలిఘట్టంలో గురువారం చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు, కౌన్సిలర్ల అభ్యర్థులు ఏకా రమణమ్మ, కొణతాల వరలక్ష్మి, దేవత అరుణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. గణేష్, సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రశాంతత కావాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో శివారు కాలనీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హమీలను గ్రహించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పట్టణంలో చిన్నాపెద్దా అందరికీ అందుబాటులో ఉండే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అనిత పోటీ చేస్తున్నారని, ఆమెతోపాటు వార్డులోని తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ యూత్ వింగ్ నాయకులు చింతకాయల వరుణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, సీనియర్ నాయకుడు ఏకా రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.


