అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో మునగపాక జెడ్పీటీసీ అభ్యర్థిని ఆడారి కమలప్రియతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో నామినేషన్లు చింపివేస్తూ, తమ పార్టీ నాయకులపై దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వానికి కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. 19 మున్సిపాలిటీల్లో రెండు రోజులు గడువు పొడిగించి కలెక్టర్, ఎస్పీలకు నామినేషన్ పత్రాలు అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీన్ని అమలు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొత్తం ఎన్నికలను వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు తొత్తుగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో కుమ్ములాట పెరిగిపోవడంతో సర్దుబాటు చేసుకునేందుకు సుప్రీం తీర్పును అడ్డుపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయమన్నారు. ప్రజలే ఓటు ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీవీ సత్యవతి, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


