జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
పక్కాగా నిబంధనలు అమలు
ఆర్‌వోలు, ఏఈఆర్‌వోల శిక్షణలో కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, ప్రతి అభ్యర్థికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు రవీంద్ర ధామతో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అభ్యర్థులందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఖర్చులు ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. పార్టీలు చేసే ఖర్చులు, అభ్యర్థులు చేసే ఖర్చులను వేర్వేరుగా గుర్తించి, వాటికి సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలన్నారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 3 వరకు జరిగే నామినేషన్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సభలు, ర్యాలీల ఆధారంగా ఖర్చుల అంచనా
ఎన్నికల వ్యయ పరిశీలకుడు రవీంద్ర ధామ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి భద్రపరచాలని సూచించారు. వాటి ఆధారంగా అభ్యర్థుల ప్రచార ఖర్చులను అంచనా వేయవచ్చన్నారు. సభలు, ర్యాలీల్లో వినియోగించే వస్తువులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వ్యక్తిగత వాహనాలను వినియోగించినప్పుడు డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చులను కూడా లెక్కల్లో చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల సభ్యులు పాల్గొన్నారు.


