నర్సీపట్నం: జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త రాజాన సూర్యచంద్రకు ఆ పార్టీ ఝలక్ ఇచ్చింది. సమన్వయకర్త బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం బాధ్యతలను ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌కు అప్పగించింది. పురపాలక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం కూటమిలో విభేదాలకు దారితీసింది. టీడీపీకి ప్రాధాన్యమిస్తూ సీట్ల కేటాయింపులు జరపడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకులు.. పురపాలక చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన నాయకురాలు అద్దెపల్లి సౌజన్య చైర్‌పర్సన్ స్థానానికి నామినేషన్ వేయడంతో కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. కూటమి చేపట్టే కార్యక్రమాల్లో ముందుండే సూర్యచంద్రకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని రెండు రోజుల్లో సస్పెండ్ చేస్తానని ఆయన తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నింటికీ భిన్నంగా పార్టీ అధిష్టానం సూర్యచంద్రను సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇతరులను పార్టీ నుంచి తొలగిస్తానని చెప్పిన నాయకుడికే పదవి దూరం కావడంతో ఆయన వర్గంలో నిరుత్సాహం నెలకొంది. మరోవైపు నాతవరం జెడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఈ స్థానం నుంచి తన భార్యను బరిలోకి దింపాలని సూర్యచంద్ర భావించారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.


