సాక్షి, అనకాపల్లి: నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వస్తుందని, అధికారికంగా బీఫాంలు అందడంతో రెబల్స్ బెడద తొలగుతుందని భావించిన కూటమి నేతలకు నిరాశే ఎదురైంది. జిల్లాలో మూడు కీలక ప్రాంతాల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశాలు, సమీక్షలు, బుజ్జగింపులు నిర్వహించినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
రెబల్స్‌తో తలనొప్పి! : అనకాపల్లి జోన్ పరిధిలోని ఆరు కార్పొరేటర్ స్థానాలకు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు మూడు, టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం కేటాయించినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లోనూ వివరాలు వెల్లడించారు. అయితే అధికారికంగా బీఫాంలు అందించే విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం మొదలైంది. 108వ వార్డును టీడీపీకి కేటాయించగా.. అదే పార్టీ నుంచి రెబల్ బెడద ఎదురవుతుంది. 109వ వార్డును జనసేనకు కేటాయించగా.. టీడీపీ నుంచి కూడా ఇక్కడ బరిలోకి దిగుతూ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు. 111వ వార్డును బీజేపీకి కేటాయించగా.. అదే పార్టీ నుంచి రెబల్ బెడద ఎదురవుతోంది. తమకే సీటు ఖరారైందన్న ధీమాతో కొందరు అభ్యర్థులు బరిలోకి దిగడం కూటమి నేతలకు తలనొప్పిగా మారింది.
యలమంచిలిలో ఝాన్సీకి నిరాశ: యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ స్థానం కోసం చివరి వరకు ప్రయత్నించిన జనసేన నేత కర్రి ఝాన్సీకి నిరాశ ఎదురైంది. కూటమి తరఫున ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. దీంతో ఝాన్సీ రెబల్‌గా బరిలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమెను చైర్పర్సన్ పోటీ నుంచి తప్పించేందుకు కూటమిలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే సుందరపు సహకారంతో జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామని భావిస్తున్న తరుణంలో ఝాన్సీని రెబల్‌గా చిత్రీకరించడం జనసేన శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఎమ్మెల్యే సహకారం ఉన్నప్పటికీ సీటు దక్కకపోవడంసౌ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
నర్సీపట్నంలోనూ అదే పరిస్థితి! : నర్సీపట్నంలోనూ కూటమి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ కుటుంబానికి చెందిన వ్యక్తి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, మరోవైపు జనసేన అభ్యర్థి కూడా బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. యలమంచిలిలో మాదిరిగానే చివరి నిమిషంలో జనసేన అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారా? లేక బరిలో కొనసాగుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. జనసేన అభ్యర్థి పోటీలో కొనసాగితే కూటమి ధర్మం ప్రకారం రెబల్‌గా ముద్రపడే అవకాశం ఉంది. మొత్తమ్మీద మూడు ప్రాంతాల్లోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటంతో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
‘దాడి’కి అవమానం!
అనకాపల్లి జోన్లో కూటమి సీట్ల కేటాయింపులో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు వార్డులైనా తమ వర్గానికి కేటాయిస్తారని తొలుత ఆశించారు. ఈ మేరకు నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో సంబంధిత అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జీవీఎంసీ కార్పొరేటర్లుగా పనిచేసిన ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు కూటమి వైపు రావడంతో తమకు సీట్లు దక్కుతాయని ఆశించినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. తమకు అండగా నిలిచే మాజీ మంత్రిని కూటమిలోని ఇతర నేతలు విస్మరిస్తున్నారనే భావన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సరైన సమయంలో తమ సత్తా చూపిస్తామనే సంకేతాలిస్తున్నారు. మరోవైపు టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేపై ఆశలు పెట్టుకున్న ఇద్దరు ఔత్సాహికులు కూడా రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. వీరు తమ పార్టీ నేతలతో పాటు వార్డుల్లోని అనుచరులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ల గడువు ముగిసినా తేలని పంచాయితీ
అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నంలో రెబల్స్ బెడద
తలలు పట్టుకుంటున్న ఆ పార్టీల నేతలు


