పాయకరావుపేట: గ్రామదేవత బంగారమ్మ అమ్మవారి భూముల్లో అనుమతులు లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారనే ఆరోపణలు పాయకరావుపేట మండలం వెంకటనగరంలో కలకలం రేపాయి. స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ నాయకులు ఈ పనులు చేపట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మత్స్యకార నాయకుడు చోడిపల్లి శ్రీను ఫిర్యాదుతో స్పందించిన దేవదాయ శాఖ అధికారులు ఆదివారం గ్రామానికి చేరుకుని రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని వెంకటనగరంలో గ్రామదేవత బంగారమ్మ అమ్మవారికి సర్వే నంబరు 111లో 9.20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శివకుమార్, సత్యనారాయణ తదితరులు పి.కాశీరాజు ఇంటికి వెళ్లేందుకు గ్రావెల్ రోడ్డు నిర్మిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం అమ్మవారి భూముల్లోనే జరుగుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన యలమంచిలి దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఆదివారం వెంకటనగరానికి చేరుకుని పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం దేవదాయ శాఖ ఆధీనంలోని బంగారమ్మ అమ్మవారి భూముల్లో జరుగుతున్నట్లు గుర్తించి పనులను నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మిస్తున్న పెనుమత్స కాశీవిశ్వనాథరాజు, వంకా శివకుమార్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామదేవత ఆలయానికి చెందిన భూముల్లో రోడ్డు నిర్మించడం దారుణమని చోడిపల్లి శ్రీను ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వెంకటనగరంలో టీడీపీ నాయకుల నిర్వాకం
బంగారమ్మ ఆలయ భూముల్లో నిర్మాణం
వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదుతోపనులు నిలిపివేత
దేవాదాయ శాఖ అధికారుల జోక్యం.. రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు


