యలమంచిలి రూరల్: మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఆవిర్భవించిన యలమంచిలి ముచ్చటగా మూడో సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ దఫా కూడా జనరల్ మహిళకే రిజర్వు అయింది. దాంతో చైర్పర్సన్ పీఠంపై మహిళనే కూర్చోనుంది. ఈ పదవిని తొలిసారి నేరుగా ఓటర్లే ఎన్నుకునే అవకాశం కల్పించడంతో ఈ నెల 30న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 డిసెంబరులో మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. సోమలింగపాలెం, కట్టుపాలెం, తెరువుపల్లి, కొక్కిరాపల్లి, పెదపల్లి, రామారాయుడుపాలెం, ఎర్రవరం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. మున్సిపాలిటీగా ఏర్పడిన దగ్గర్నుంచి 2014 వరకు ప్రత్యేకాధికారుల పాలనలో ఉంది. అప్పటి నుంచి రెండుసార్లు మున్సిపల్ ఎన్నికలు జరగగా.. మహిళలకే చైర్పర్సన్ పదవి దక్కింది. ఇప్పుడు మూడోసారి కూడా పుర పీఠం జనరల్ మహిళకే రిజర్వు అయింది.
రెండు పర్యాయాలు చైర్పర్సన్గా రమాకుమారి
యలమంచిలి మున్సిపాలిటీకి 2014లో తొలిసారి, 2021లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. రెండు పర్యాయాలు పిల్లా రమాకుమారి చైర్పర్సన్గా విజయం సాధించారు. అప్పుడు మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులుండేవి. ప్రస్తుతం యలమంచిలి మున్సిపాలిటీలో 60 వేలు జనాభా ఉండగా.. 32 వార్డులు, 36,526 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో రెండు సార్లు పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక జరగగా.. ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. మూడోసారి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న యలమంచిలి మున్సిపాలిటీ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న యలమంచిలి పట్టణంలో ఏటా దీపావళి నుంచినాగుల చవితి వరకు నిర్వహించే పంచరాత్రి ఉత్సవాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
పురుష అభ్యర్థులకు నిరాశే..
ప్రస్తుతం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి యలమంచిలి చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు పురుష అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. మొత్తానికి మరో ఐదేళ్లు.. అంటే 15 ఏళ్లు యలమంచిలి పాలన మహిళ చేతుల్లో కొనసాగినట్లవుతుంది. దీనికి తోడు ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కౌన్సిలర్లు సైతం సగం మంది మహిళలే కొలువుదీరనున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బొద్దపు తులసి బరిలో ఉన్నారు. ఒక్కసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.
మున్సిపాలిటీ సమాచారం
వార్డుల సంఖ్య 32
మొత్తం ఓటర్లు 36,526
పురుషులు 17,450
మహిళలు 19,068
ఇతరులు 08
సామాజిక వర్గాల ఓటర్ల సమాచారం
ఎస్సీ ఓటర్లు 3243
పురుషులు 1534
మహిళలు 1707
ఇతరులు 02
ఎస్టీ ఓటర్లు 38
పురుషులు 20
మహిళలు 18
బీసీ ఓటర్లు 29,543
పురుషులు 14,112
మహిళలు 15,426
ఇతరులు 05
ఈసారి కూడా జనరల్ మహిళకే రిజర్వు
రెండు పర్యాయాలు మహిళలకే దక్కిన చైర్పర్సన్ పీఠం
2011లో మున్సిపాలిటీగా యలమంచిలి ఆవిర్భావం
2014లో తొలిసారి పురపాలక ఎన్నికలు


