రూపు మార్చి.. నిఘా ఏమార్చి..! | - | Sakshi
Sakshi News home page

రూపు మార్చి.. నిఘా ఏమార్చి..!

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

● ద్రవరూపంలో గంజాయి రవాణా ● రూటుమార్చిన స్మగ్లింగ్‌ మాఫియా ● విస్తరిస్తున్న హషీస్‌ ఆయిల్‌ మత్తు

నర్సీపట్నం : దేశ, విదేశాల్లో అల్లూరి జిల్లా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయి మత్తు వెదజల్లుతుంది. గంజాయి రూపం మార్చుకుంటోంది. పోలీసుల కళ్లు కప్పి మాఫియా కొత్త దారిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతుంది. గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి..నిఘా కళ్లను ఏమార్చేందుకు స్మగ్లర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిని పెట్టి కొరడా ఝుళిపిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా గంజాయి రవాణాకు తెర పడడం లేదు.

పొడి నుంచి లిక్విడ్‌ తయారీ...

ఇంత వరకు పొడి గంజాయి దేశంలోని కొన్ని రాష్ట్రాలకు రవాణా అయ్యేది. గంజాయి మాఫియా పొడి గంజాయిని లిక్విడ్‌గా మార్చి దేశ సరిహద్దులు దాటించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. పొడి గంజాయి కంటే.,లిక్విడ్‌ గంజాయికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉండడంతో ఏజెన్సీలో పండించిన గంజాయిని లిక్విడ్‌ రూపంలో మార్చి రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. పెడదారి పట్టిన యువత మత్తును ఆస్వాదించేందుకు లిక్విడ్‌ గంజాయికి రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఇటీవల కాలంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసుల నిఘా పెరగడంతో ఏజెన్సీలో పండించిన గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించడం కష్టసాధ్యంగా మారింది.

●గొలుగొండ పోలీసులు ఈ ఏడాది జూలై 14న రూ.33 లక్షలు విలువైన 2 కిలోల లిక్విడ్‌ గంజాయి స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

●నాతవరం పోలీసులు ఆగస్టు 25న సుమారు రూ.2 కోట్లు విలువ చేసే 14.7 కిలోల లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

●గొలుగొండ పోలీసులు ఈ నెల 10న సుమారు రూ.28 లక్షల విలువైన 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, యువతి, యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ మధ్య కాలంలో అధికంగా లిక్విడ్‌ గంజాయితోనే స్మగ్లర్లు పట్టుబడుతుండడం గమనార్హం.

సరిహద్దు గ్రామాల్లో తయారీ కేంద్రాలు

అల్లూరి జిల్లా, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గ్రామాలతో పాటు ఏజెన్సీలో ధారకొండ, జి.మాడుగుల, సీలేరు ప్రాంతాలు లిక్విడ్‌ గంజాయి తయారీకి కేంద్రాలుగా మారాయి. ఇక్కడ నుండే లిక్విడ్‌ గంజాయి అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుతోంది.

ప్రాంతాన్ని బట్టి రేటు..

ప్రాంతాన్ని బట్టి లిక్విడ్‌ గంజాయి రేటు పెరుగుతుంది. విశాఖ ఏజెన్సీలో కిలో రూ.లక్ష ఉంటుంది. రాష్ట్ర సహద్దు దాటి తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే సరికి కిలో లిక్విడ్‌ గంజాయి రూ. 2 లక్షల వరకు ధర పలుకుతుంది. విదేశాలలో కిలో రూ.5 లక్షల వరకు డిమాండ్‌ ఉందని బోగట్టా.

హుక్కా ద్వారా...

హుక్కా పీల్చే అలవాటు చాలా రాష్ట్రాల్లో ఉంది. హుక్కాలో కొన్ని చుక్కల లిక్విడ్‌ గంజాయి వేసి ఆస్వాదిస్తుంటారు. యువకులు, విద్యార్థులు సిగరెట్లపై ఇంక్‌ పిల్లర్లతో రెండు నుంచి మూడు చుక్కలు వేసుకొని దమ్ము లాగుతారు. చాక్లెట్‌ మధ్యలో ఈ లిక్విడ్‌ గంజాయిని ఉంచి అమ్మకం చేస్తున్నారు. వివిధ రూపాల్లో లిక్విడ్‌ గంజాయిని సేవించి మత్తును ఆస్వాదిస్తున్నారు. అల్లూరి ఏజెన్సీ శీలావతి రకం గంజాయి పొడి, లిక్విడ్‌ రూపంలో దేశ, విదేశాల్లో మత్తును వ్యాపిజేస్తుంది.

మూలాలు నాశనం చేసేందుకు చర్యలు

లిక్విడ్‌ గంజాయి రవాణాకు అడ్డు కట్ట వేస్తున్నాం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయిస్తున్నాం. దీని మూలాలు కనుక్కొని వాటిని నాశనం చేసేందుకు చర్యలు చేపట్టాం. మరింత నిఘా ఏర్పాటు చేసి వీలైనంత వరకు దీనిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. ఈ మధ్య కాలంలో లిక్విడ్‌ గంజాయి రవాణాను ఛేదించాం. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించి, ఆస్తులను సైతం జప్తు చేస్తాం.

–పి.శ్రీనివాసరావు, డీఎస్పీ, నర్సీపట్నం

లిక్విడ్‌ తయారీ...

ఏజెన్సీలో సేకరించిన కిలోల కొద్దీ ఎండు గంజాయిని టోల్యూన్‌ కెమికల్‌ అయిల్‌తో రాతంత్రా నానబెడతారు. ఇలా నానిన గంజాయిని ఆ మర్నాడు ఉదయాన్నే గుడ్డలో వేసి పిండగా వచ్చిన రసాన్ని కుక్కర్లో ఉడికిస్తారు. కుక్కర్‌ నుంచి వచ్చిన అవిరి బయటకు పోయే మార్గం వద్ద ప్లాస్టిక్‌ రాగి ట్యూబ్‌ ఏర్పాటు చేసి దాని చివరి భాగం బాటిల్‌లోకి పెట్టి దానిలో గాలి చొరవబడకుండా గుడ్డ ఏర్పాటు చేస్తారు. కుక్కర్‌లోని ద్రవం బాగా ఉడికిన తర్వాత ఆవిరి కుక్కర్‌కు బిగించిన సీసా నుంచి బాటిల్‌లోకి పడతారు. చిక్కగా వచ్చిన ద్రవాన్ని లిక్విడ్‌ గంజాయిగా కిలో ప్యాకెట్లుగా చేసి రవాణా చేస్తున్నారు. దీనిని తయారు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులను తీసుకొచ్చి స్థానికంగా ఉన్న గిరిజన యువతకు తర్ఫీదు ఇస్తున్నారు. 25 కిలోల ఎండు గంజాయిని ప్రొసెస్‌ చేస్తే కిలో లిక్విడ్‌ గంజాయి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement