1064 పాఠశాలలో ఏకగ్రీవం
338 పాఠశాలల్లో ఎన్నికలు
30 పాఠశాలల్లో కోరం లేక వాయిదా
ఫంగిడిలో టీడీపీ నేత అలజడి
పోలీసులను తోసుకుని ఎన్నికల గదిలోకి వెళ్లి బెదిరింపులు
చైర్మన్ అభ్యర్థిని గెలిపించాలని నగదు ఫోన్ పే చేసి ప్రలోభాలు
కోరం ఉన్నా భద్రత లేదని ఎన్నికను వాయిదా వేసిన అధికారులు
అనకాపల్లి టౌన్ : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి అయ్యిందని సమగ్రశిక్ష అడిషనల్ ప్రోజెక్ట్ కోఆర్డినేటర్ కె.శ్రీరాములు తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో అధిక సంఖ్యలో పాఠశాలల్లో కమిటీలు ఏకగ్రీవంగా ఏర్పాటయ్యాయి. మొత్తం 1,432 పాఠశాల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 1,064 పాఠశాలల్లో కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో 338 పాఠశాలలో ఎన్నికలు నిర్వహించి ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేశారు. 30 పాఠశాలల్లో ఎన్నికకు సరిపడా సభ్యులు లేని కారణంగా ఎన్నికలు వాయిదా వేశామన్నారు. దీంతో జిల్లాలోని అత్యధిక పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, తల్లిదండ్రుల భాగ స్వామ్యాన్ని పెంచడంలో ఎస్‌ఎంసీలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించినందుకు సహకరించిన ఎంఈవోలు, మండల నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత తల్లిదండ్రులకు ఏపీసీ అభినందనలు తెలిపారు.
ఫంగిడిలో టీడీపీ నేత రుబాబు
బుచ్చెయ్యపేట : మండలంలోని పెదపూడి శివారు ఫంగిడి గ్రామంలో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరి తెగించారు. చిన్న పిల్లలు చదువుకునే దేవాలయం లాంటి పాఠశాలలోకి పోలీసులను సైతం తోసుకొని వచ్చి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను,అధికారులను సైతం బెదిరించారు. టీడీపీకి ఆ గ్రామంలో పట్టు లేదని తెలిసి ఓడిపోతామని తెలిసి కూడా దొడ్డి దారిలో గెలవాలని అక్కడ టీడీపీ నాయకుడు డబ్బులు ఎర చూపాడు. విద్యార్థి తండ్రికి రూ, 50 వేలు ఫోన్ పే చేయగా అతను మాత్రం నిజాయితీకే ఓటు వేస్తానని చెప్పి తిరిగి యాభై వేలు నగదును టీడీపీ నాయకుడికి ఫోన్ పే చేశాడు. దీంతో టీడీపీ నాయకులు ఓడిపోతున్నామని తెలిసి అక్కడున్న పోలీసులను సైతం తోసుకుంటూ ఎన్నికల గదిలోకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులపైన, అధికారులపై గొడవకు దిగి ఎన్నికను వాయిదా వేసేలా చేశారు. ఫంగిడి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థులున్నారు. వీరిలో 19 మంది తల్లిదండ్రులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. మంగళవారం జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో భాగంగా 11 మంది వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపగా ఐదుగురు మాత్రం టీడీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గెలుస్తున్నారని తెలిసి బయట నుంచి టీడీపీ కార్యకర్తలు పాఠశాల గదిలోకి చొరబడ్డారు. అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును సైతం తోసుకుంటూ వచ్చి అలజడి సృష్టించారు. దీంతో అక్కడే ఉన్న ఏంఈవో పి.గీత, హెచ్‌ఎం శాంతి కుమారిలు ఎన్నికల నిర్వహణకు భద్రత లేదని ఎన్నికను వాయిదా వేసినట్టు ప్రకటించారు. కోరం ఉన్నప్పటికి టీడీపీ నాయకులు చెప్పినట్టుగా అధికారులు నడుచుకొని భద్రత లేదని ఎన్నిక వాయిదా వేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు. భద్రత లేని పాఠశాలలో మా పిల్లలను చదివించమని గ్రామానికి చెందిన పలువురు తమ పిల్లలను ఇకపై బడికి పంపమని హెచ్‌ఎంకు తెలిపి లెటర్లు ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ ఒకరు ఎలాగైనా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని రెండు రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడని రూ, 50 వేలు ఫోన్ పే చేయగా రిటర్న్ చేశానని గ్రామానికి చెందిన కోరుబిల్లి కలిపిరాజు విలేకరులకు తెలిపారు.


