కశింకోట: మద్యం బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యర్రా దేముడు విమర్శించారు. స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద సోమవారం జరిగిన జిల్లా కల్లు గీత కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్టు దుకాణాల నిర్మూలనకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశామన్నారు. బెల్టు దుకాణాల వల్ల గీత కార్మికుల జీవనోపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల లైసెన్స్ నవీకరణను ప్రభుత్వం నిలుపుదల చేసి, గీత వృత్తి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం 20 శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించడం సమంజసం కాదన్నారు. వీటి సంఖ్యను పెంచి గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపర్చాలని కోరారు. గతంలో అమలు చేసిన ఆదరణ పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ సభ్యులు కట్టా ఈశ్వరరావు, రాయి ఆనంద్, గండిబోయిన అప్పారావు, దొడ్డి నారాయణ, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


