నక్కపల్లి : మండలంలోని రాజయ్యపేటలో ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. సుమారు రూ.9 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులకు తెలిపిన మేరకు వివరాలివి. గ్రామానికి చెందిన చోడిపల్లి చిట్టమ్మ ఉదయం తన ఇంటి తలుపులు వేసుకొని తాళం వేయకుండా వేరొకరి ఇంటికి వెళ్లింది. గంట తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి వెనుక వైపు తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ట్రంక్ పెట్టె కనిపించలేదు. ఈ పెట్టెలో ఉన్న రెండు తులాల బంగారు గాజులు, రెండు తులాల పుస్తెల తాడు, 20 తులాల వెండి పట్టీలు కనిపించలేదు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ జె. మురళి తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


